calender_icon.png 23 October, 2024 | 5:10 AM

తెగిన ఎన్‌ఎస్‌పీ కాల్వ కట్ట

02-09-2024 02:13:15 AM

సూర్యాపేట, సెప్టెంబర్ 1: సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం గ్రామ సమీపంలో సాగర్ ప్రధాన ఎడమ కాల్వకు 117  కిలోమీటర్ వద్ద కాల్వ కట్ట తెగిపోయింది. దీంతో కాల్వలోని నీరు పంట పొలాలలోకి చేరి కోతకు గురికావడంతో సుమారు మూడు వేల ఎకరాలలో రైతులకు నష్టం వాటిల్లింది. శనివారం రాత్రిపడిన గండి నుంచి నీటి ప్రవాహం తగ్గకుండా ప్రవహిస్తూనే ఉంది. దీంతో కాగిత రామచంద్రాపురం ఎస్సీ కాలనీలోకి నీరు చేరి కాలనీ వాసుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. ప్రవాహం తగ్గకపోవడంతో  పంటపొలాలు కొట్టుకుపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉండగా తెగిన కాల్వ కట్టను  కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్,  ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించి అధికారులు పలు సూచనలు చేశారు. ఆర్లెగూడెం సమీపంలో కాల్వ కట్ట తెగి పొలాలలోకి చేరిన నీరు సమీపంలోని రోడ్డుపైకి రావడంతో రహదారి దెబ్బతిన్నది. దీంతో ప్రయాణానికి ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని సింగారం గ్రామ సమీపంలో ఎన్నెస్పీ కాల్వకు వేసిన లైనింగ్ వర్షం కాకణంగా కొట్టుకపోయి ఒక చోట గుంత ఏర్పడింది. దీంతో అక్కడ బుంగపడి కాల్వకట్ట కొట్టుకుపోతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.