calender_icon.png 8 January, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలయనాడ్!

31-07-2024 01:03:14 AM

విరిగిపడిన కొండచరియలు.. బతుకులు మట్టిపాలు

  • కేరళలో మహా విపత్తు 

కనిపించకుండా పోయిన 120 మంది 

4 గంటల వ్యవధిలో ౩ విపత్తులు

తుడిచిపెట్టుకుపోయిన ౩ గ్రామాలు

వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రళయం

107 మంది సజీవ సమాధి

* దైవ భూమి మరుభూమిగా మారింది. పచ్చని ప్రకృతి అందాలకు, ప్రకృతి సోయగాలకు నెలవైన పశ్చిమ కనుమల్లో ప్రళయం పుట్టింది. ఆకాశమే ఊడిపడిందా అన్నట్టుగా కొండలు ఊడిపడ్డాయి. ఆకాశానికి చిల్లు పడినట్టుగా కురుస్తున్న భీకర వర్షాలు పర్వతాలను పెకిలించి అందమైన పొదరిళ్ల వంటి గ్రామాలను కప్పేశాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ఏకబిగిన కొండ చరియలు విరిగిపడటంతో కేరళలోని వయనాడ్ జిల్లా ముండకై, చూరల్‌మల, అట్టమల, నూల్‌పుజ గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రకృతిమాత ఒడిలో ప్రశాంతంగా బతుకుతున్న ఆ గ్రామాల ప్రజలు మట్టి, బురద ప్రళయంలో సజీవ సమాధి అయ్యారు.  ఊహించని విధంగా తరుముకొచ్చిన మృత్యువు 107 మంది సామాన్యులను పొట్టనబెట్టుకొన్నది. 

* ఈ ప్రకృతి విపత్తులో 116 మందికి గాయాలయ్యాయి. మరో 120 మంది జాడ తెలియటం లేదు. కేరళ ప్రభుత్వం, విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్‌ఎఫ్)తోపాటు సైన్యం కూడా రంగంలోకి దిగి బురదలో కూరుకుపోయి  హాహాకారాలు చేస్తున్న బాధితులను కాపాడుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నదని కేరళ ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులను ఆదుకొంటామని ప్రధాని ప్రకటించారు.          

కేరళలో మహా విపత్తు

విరిగిపడిన కొండచరియలు 

107 మంది సజీవ సమాధి

116 మందికి గాయాలు

4 గంటల వ్యవధిలో మూడు విపత్తులు

తుడిచిపెట్టుకుపోయిన మూడు గ్రామాలు

తిరువనంతపురం, జూలై 30: ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా జీవిస్తున్న అమాయక ప్రజలను ఆ ప్రకృతే కబలించింది. నీరు, భూమి ఏకమై దండెత్తినట్టు మశ్చిమ కనుమలపై విరుచుకుపడటంతో 1౦7 మంది సజీవ సమాధి అయ్యారు. వందల మంది గల్లంతయ్యారు. 107 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి మొదలైన ప్రకృతి ఉప్పెన మంగళవారం వరకు కొనసాగింది. 

మరుభూమిగా దేవభూమి

మనదేశంలో ప్రకృతి అందాలకు నెలవు కేరళ. పశ్చిమ కనుమల అందాలతో అలరారే కేరళ రాష్ట్రాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ (దేవుడి సొంత దేశం) అని ముద్దుగా పిలుచుకొంటారు. అలాంటి అందమైన సీమ, ప్రకృతి ప్రకోపానికి కకావికలమైంది. మిన్ను విరిగి మీద పడినట్టు కొండలకు కొండలే అమాంతం విరిగి గ్రామాలపై పడ్డాయి. దీంతో మట్టి, బురద కింద ప్రజలు సజీవ సమాధి అయ్యారు. ముండక్కై, చూరల్‌మల, అట్టమల, నూల్‌పుజ గ్రామాలను బురద కప్పేసింది. దీంతో వందల ఇండ్లు ధ్వంసమయ్యాయి. వందల వాహనాలు బురద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.  

అర్థరాత్రి మొదలు

భారీ వర్షాల కారణంగా సోమవారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ముండకై గ్రామం సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. స్థానికుల సమాచారం అక్కడికి చేరుకొన్న సహాయ సిబ్బంది.. బాధితులను సమీప చురుల్‌మల గ్రామంలో ఉన్న పాఠశాల వద్ద ఉన్న సహాయ పునరావాస శిబిరానికి తరలించారు. ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకొంటున్న సమయంలోనే పాఠశాల సమీపంలోనే భారీగా కొండచరియలు విరిగిపడి ఆ శిబిరాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేశాయి. దీంతో అక్కడ తలదాచుకొంటున్నవారంతా చనిపోయారు. అదే సమయంలో సమీపంలోని మరో రెండు గ్రామాలపై కూడా మట్టి, బురద, నీరు ముంచెత్తింది. 

సహాయ చర్యలకు ఆటంకం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో సహాయ బృందాలు అక్కడికి వెళ్లేందుకు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నది. రోడ్లపై భారీ బండరాళ్లు దొర్లిపడటంతో రాకపోకలు స్తంభించాయి. ఆ ప్రాంతం మీదుగా వెళ్లే రైళ్లను కూడా రద్దుచేశారు.  

భారీ రెస్క్యూ ఆపరేషన్

బురదలో కూరుకుపోయిన బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టాయి. హెలికాప్టర్లు, డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. రెండు ఎయిర్‌ఫోర్స్ విమానాలు, ఒక ఎంఐ ఒక అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ సహాయ చర్యల్లో వినియోగిస్తున్నట్టు సైన్యం ప్రకటించింది. సహాయ చర్యల్లో 225 మంది సైనికులు, 150 మందివరకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొంటున్నారు. స్థానిక అధికారులు వీరికి సహాయం అందిస్తున్నారు.  ముండక్కై గ్రామం నుంచి సైన్యం 150 మందిని రక్షించింది. కేరళ ప్రభుత్వం ఐదుగురు మంత్రులను సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు నియమించింది.  

ఇది మహా విపత్తు: పినరాయి విజయన్

వయనాడ్ ప్రమాదంపై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహా విపత్తు అని పేర్కొన్నారు. నాలుగు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రెండురోజుల పాటు రాష్ట్రంలో సంతాపదినాలుగా ప్రకటించారు. ‘ఈ ప్రమాదాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. ఇక్కడ కుండపోత వర్షం పడుతున్నది. ఆ ప్రాంతం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఎంతోమంది నిద్రలోనే మృత్యు ఒడిలోకి జారుకొన్నారు’ అని తెలిపారు.  

వలస కార్మికులు ఎక్కడ?

వయనాడ్ ప్రమాదంలో సుమారు 600 మంది వలస కూలీల ఆచూకీ గల్లంతయ్యిందని  తెలుస్తోంది. వారంతా కాఫీ, తేయాకు, యాలకుల తోటల్లో పనిచేసేందుకు బెంగాల్, అస్సాం నుంచి వచ్చినట్లు సమాచారం. ఆ ప్రాంతాల్లో ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో కార్మికులను  గుర్తించటం కష్టతరమైందని తోటల యాజమానులు చెప్తున్నారు. 

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం: ప్రధాని

వయనాడ్ విపత్తుపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. విపత్తు వార్త తెలిసిన వెంటనే కేరళ సీఎం పినరాయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు. సహాయ చర్యల కోసం కేరళ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రూ.5 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ ప్రమాదంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలోనే బాధితులను పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంక వయనాడ్ వెళ్తారని కాంగ్రెస్ నేత కేకే వేణుగోపాల్ వెల్లడించారు.