రోడ్డు పక్కన నలిగి,
దుమ్ము కొట్టుకుపోయిన
ప్రాణం వున్న ఆ మెత్తటి పువ్వుల
కన్నీటి గేలానికి, పొరబాటున
ఏ తడి గుండ్లునా గుచ్చుకుంటే
విలవిల్లాడాల్సిందే!
కరడు కట్టిన ఆకలికి పుట్టిన
కదిలించే కన్నీటి
చిత్రాల దయనీయత
హృదయానికి ఏ
మూలైనా తాకితే
వేదన చెందాల్సిందే!
అమ్మ ప్రేమ,
నాన్న అనురాగం
ఎక్కడైనా చూస్తే వాళ్ళకో వింతే అది!
ఆకలి చల్లార్చే ప్రతీది వాళ్ళకు అమ్మానాన్నే!
మనుషుల్ని మాంసపు ముద్దల్లా
పొట్లం కట్టి అమ్మేసే
కటిక పేదరికం
వర్ధిల్లుతుంటే బాల్యానికి బాసట ఎక్కడ?
చేయి చాస్తేగానీ నిండని కడుపులు కొన్నయితే
రెక్కాడితేగానీ నిండని కడుపులు ఇంకొన్ని
దేహాన్ని దాహానికి
ఇస్తేగానీ నిండని
కడుపులు మరికొన్ని
బాల్యం అందమైంది
తిరిగి రానిది..
ఇది వాళ్ళకు ఏ మాత్రం
వర్తించని వాక్యం!
బాల్యం దుర్భరమైంది,
గడిచిన ప్రతీరోజూ
మళ్ళీ రాకూడనిది..
ఇదే వాళ్ళకు సంబంధించి కఠిన వాస్తవం!
భీమవరపు పురుషోత్తమ్