calender_icon.png 31 October, 2024 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగళూరులో బ్రిటన్ రాజదంపతులు

31-10-2024 03:30:00 AM

  1. క్యాన్సర్ బారిన పడిన తర్వాత మొదటి పర్యటన ఇదే
  2. వెల్‌నెస్ సెంటర్‌లోనే నాలుగు రోజులుపాటు బస 
  3. యోగా, మెడిటేషన్ సాధన చేసిన కింగ్ చార్లెస్-3

బెంగళూరు, అక్టోబర్ 30: కింగ్ చార్లెస్-3 సతీసమేతంగా నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటించారు. బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సారిగా భార్య కెమెల్లాతో సహా బెంగళూరుకు వచ్చిన నాలుగు రోజులపాటు బెంగళూరులోనే గడిపి, బుధవారం తిరుగు పయనమయ్యారు.

ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం చార్లెస్ దంపతులు అక్టోబర్ 21-26 తేదీల మధ్య సమోవాలో కామన్‌వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాల అనంతరం ఈ దంపతులు అక్టోబర్ 27న నేరుగా బెంగళూరుకు చేరుకుని, అక్కడే ఉన్న సౌక్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ సెంటర్(ఎస్‌ఐహెచ్‌హెచ్‌సీ)లో బస చేశారు.

ఇక్కడ ఈ రాజదంపతులు యోగా, మెడిటేషన్ వంటి ప్రకృతి సంబంధమైన చికిత్సలు తీసుకున్నారు. క్యాన్సర్ బారిన పడిన తర్వాత చార్లెస్ -3 చేసిన మొదటి ఇంటర్నేషనల్ ట్రిప్ ఇదే కావడం గమనార్హం. ఈ పర్యటన భారతదేశ వైద్య విధానంపై ఆయనకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని జాతీయ మీడియా అభిప్రాయపడింది. 

పూర్తిగా వ్యక్తిగత పర్యటన 

ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన అయినందువల్ల భారత ప్రభుత్వాధినేతలు ఎవరూ అయనకు ఆహ్వానం పలకలేదని వివరించింది. అలాగే బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌కు మొదటిసారిగా విచ్చేసినప్పటికీ కింగ్ చార్లెస్ -3 కూడా ఎక్కడా ప్రజలతో మమేకం కాలేదని పేర్కొంది.

వేల్స్ యువరాజుగా ఉన్న సమయంలో చార్లెస్ పలుమార్లు ఇండియాలో పర్యటించి ఇప్పటి వరకు ౯ సార్లు ఎస్‌ఐహెచ్‌హెచ్‌సీని సందర్శించారు. ఈ సందర్భంగా వెల్‌నెస్ సెంట ర్లో మూడుసార్లు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన తన 71వ పుట్టిన రోజును ఇక్కడే జరుపుకోవడం విశేషం. డాక్టర్ ఇస్సా క్ మథాయ్ తన భార్యతో కలిసి 2011లో ఎస్‌ఐహెచ్‌హెచ్‌సీని ప్రారంభించారు.