calender_icon.png 2 October, 2024 | 5:53 AM

పెథాలజీ కోర్సుతో ఉజ్వల భవిష్యత్!

02-10-2024 12:38:57 AM

మెడికల్ కోర్సులానే ఆడియాలజీ స్పీచ్ లాంగ్వేజ్ కోర్సు

  1. నాలుగేళ్ల కాలపరిమితితో గ్రాడ్యుయేట్ కోర్సు
  2. హాస్పిటల్స్, రిహాబిలిటేషన్ కేంద్రాల్లో ఉద్యోగాలు
  3. విజయక్రాంతి’తో హెల్‌న్‌కెల్లర్ విద్యాసంస్థల చైర్మన్ పఠాన్ ఉమ్మర్ ఖాన్

* మెడికల్ కోర్సు మాదిరిగానే ఆడియాలజీ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ కోర్సు ఉంటుందని హెలెన్ కెల్లర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిజేబుల్ చిల్డ్రెన్స్ విద్యాసంస్థల చైర్మన్ పఠాన్ ఉమ్మర్ ఖాన్ తెలిపారు. ఇందులో నాలుగేళ్ల గ్రాడ్యుయేట్ కోర్సు, నాలుగేళ్ల రిహాబిలిటేషన్ గ్రాడ్యుయేట్ కోర్సు ఉంటాయని చెప్పారు.

ఈ ప్రొఫెషనల్ కోర్సుల గురించి చాలా మందికి తెలియదన్నారు. దీనిని అలైడ్ మెడికల్ కోర్సు అంటారని వివరించారు. ఈ కోర్సుకు సంబంధించి పలు విసయాలను ‘విజయక్రాంతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి) :

ఈ కోర్సు మన దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ ఉంది? ఎప్పుడు ప్రారంభించారు?

మెడికల్ కోర్సు మాదిరిగానే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే సంస్థ (స్వతంత్ర ప్రతిపాదిత గల సంస్థ) బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ కోర్సును అందజేస్తుంది. దేశవ్యాప్తంగా దాదాపు 90 డిగ్రీ కళాశాలలు, 40 పీజీ కాలేజీల్లో వీటిని బోధిస్తున్నారు. తెలు గు రాష్ట్రాల్లో కేవలం నాలుగు కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అవీ హైదరాబాద్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక టి, ప్రైవేటు యాజమాన్యాల అధ్వర్యంలో మూడు నడుస్తున్నాయి.

మీరు ఎంతకాలంగా ఈ కళాశాల నడుపుతున్నారు? ఇది ఏ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది?

హెలెన్ కెల్లర్ కళాశాల 23 సంవత్సరాల నుంచి బిఏఎస్‌ఎల్పీ, యూజీ కోర్సు ను అందిస్తుంది. 16 సంవత్సరాల నుంచి పీజీ కోర్సును సైతం నడుపుతున్నాము. ఇది ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంతో నడుస్తుంది.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పిజీ) లో స్పెషలైజేషన్ ఏమైనా ఉందా?

మొదట్లో పీజీ కోర్సు ఎంఏఎస్‌ఎల్‌పీ ఉండేది. గత నాలుగేళ్ల నుంచి ఈ కోర్సు ఎంఎస్సీ ఆడియాలజీ, అదేవిధంగా ఎంఎ స్సీ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ రెండుగా స్పెషలైజేషన్ కలిగి ఉన్నాయి. ఈ రెండు పీజీ కోర్సులు మా దగ్గర ఉన్నాయి.

బీఏఎస్‌ఎల్‌పీ యుజీ కోర్సు చేసిన వారికి ఎలాంటి ఉద్యోగాలు దొరుకుతాయి? 

ఈ కోర్సు చేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్, స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్‌లు, ప్రత్యేక పాఠశాలలు, చైల్డ్ గైడెన్స్ సెంటర్లు, రిహాబిలిటేషన్ సెంటర్లలో ఉద్యోగం పొందవచ్చు. అంతే కాకుండా రిహాబి లిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ)లో రిజిస్ట్రేషన్ చేసుకొని స్వంతంగా క్లినిక్స్ ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చును.

విదేశాల్లో డిమాండ్ ఉందా?

దాదాపు 30 శాతం మంది విద్యార్థులు యుజీ, పీజీ కోర్సుల తర్వాత మా విద్యాసంస్థ, దేశంలోని ఇతర విద్యాసంస్థల్లో ఉత్తీర్ణులైనవారు యూఎస్‌ఏ, కెనడా, యూకే, సింగపూర్, మలేషియా, నైజీరియా, సౌదీఅరేబియా దేశాల్లో ఉద్యోగులుగా పని చేస్తున్నారు.

నాలుగేళ్ల  బీఏఎస్‌ఎల్‌పీ తర్వాత ఎలాంటి చదువులు చదవచ్చు?

ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎంఎస్సీ ఆడియాలజీ, ఎంఎస్సీ ఎస్‌ఎల్‌పీ, ఎంఏ లింగ్విస్టిక్స్, ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ ఇంగ్లిష్, ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్‌మెంట్, అమెరికాలో ఎయుడి డాక్టర్ ఐన్ ఆడియాలజీ యూకెలో ఆడియాలజికల్ మెడిసిన్, ఆస్ట్రేలియాలో ఆడియో టెక్నాలజీ కోర్సులు చేయవచ్చును.

బీఏఎస్‌ఎల్‌పీ తర్వాత  ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఉందా?

బీఏఎస్‌ఎల్‌పీ మిగతా ప్రొఫెషనల్ కోర్సుల మాదిరిగానే ఇది ప్రభుత్వం గుర్తించిన ఒక ప్రొఫెషనల్ కోర్సు. ఈ విద్యార్హతతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు సంపాదించడమే కాకుండా అన్ని పోటీ పరీక్షలకు వీరు అర్హులు.

కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు ఏమిటి?

ఇంటర్ లేదా తత్సమాన కోర్సు బైపీసీ లేదా ఫిజిక్స్, బయలాజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టు నుంచి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయ్యి వుండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థు లకు 45 శాతం మార్కులు ఉండాలి.

అకాడమిక్ ఇయర్ ఎప్పుడు మొదలవుతుంది?

యేటా ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల అవుతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయి.

బీఏఎస్‌ఎల్‌పీలో చేరేందుకు నిబంధనలు ఏమిటి?

ప్రస్తుత విద్యాసంవత్సరానికిగాను హెలెన్ కెల్లర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ కోర్సులో చేరాలనుకుంటున్న విద్యార్థులు పూర్తి వివరాల కోసం నేరేడ్‌మెట్‌లోని కళాశాల కరస్పాండెంట్‌ను సంప్రదించాలి.