calender_icon.png 21 October, 2024 | 3:21 AM

గిరిజన చట్టానికి తూట్లు

21-10-2024 12:20:10 AM

  1. భద్రాద్రి జిల్లాలో అమలుకాని 1/70 చట్టం
  2. దర్జాగా బహుళ అంతస్తుల నిర్మాణాలు
  3. పట్టించుకోని అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 20 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన చట్టాలకు అధికారులు ముసుగు తొడిగారు. 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా చేస్తున్నా, వ్యాపార సముదాయాలు, పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్, షోరూంలు ఏర్పాటు చేస్తున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.

చుంచుపల్లి మండలం లోని విద్యానగర్ కాలనీ, లక్ష్మిదేవిపల్లి మండలంలో, సుజాతనగర్ మండలంలో 1/70 చట్టం అమలులో ఉన్నా ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్తులు, సెల్లార్లు నిర్మిస్తున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ పూర్తిగా గిరిజన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో చట్టానికి ముసుగేసి దర్జాగా వ్యాపారమయంగా మార్చివేస్తున్నారు.

జిల్లా కేంద్రంగా కొత్తగూడెం మారడంతో ఈ ప్రాంతంలో వివిధ వ్యాపార దుకాణాల ఏర్పాటుకు కట్టడాలను ముమ్మరం చేస్తున్నారు. నిబంధన లను యథేచ్ఛగా విస్మరించి మూడంతస్తులు, నాలుగంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారు. ఇటు జిల్లా అధికారులైన డీపీవోకు పట్టదు, పంచాయతీ అధికారికి గిట్టదు అన్నట్లు ఉందని గిరిజన సంఘాల నాయకులు వాపోతున్నారు. 

అధికారులకు ఆమ్యామ్యాలు?

అభివృద్ధి పేరుతో చట్టానికి తూట్లు పొడుస్తున్నారని గిరిజన సంఘాల నాయకులు ధ్వజమెత్తుతున్నారు. గతంలో నాగేశ్వర సినిమాహాల్ ఉన్న ప్రాంతంలో ఒక వ్యాపార సంస్థ నిర్వాహకుడు ఏకంగా పెద్ద భవనాన్ని సెల్లార్లతోపాటు నిర్మిస్తున్నాడు. అతడికి పెద్దల అండ దండిగా ఉన్నదని ప్రచారం సాగుతోంది.

అనుమతులు ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని గిరిజన సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేని భవనాలకు ఇంటి నంబర్లు ఎలా వస్తున్నాయి, వాటిపై షోరూంలకు, షాపింగ్ మాల్స్‌కు లీజ్‌కు ఎలా ఇస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని గిరిజన సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

పెద్ద మొత్తంలో జిల్లా స్థాయి అధికారి నుంచి పంచాయతీ గుమస్తా వరకు అమ్యామ్యాలు ముడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిర్మాణాలే అక్రమం అంటే షాపింగ్‌మాల్స్, షోరూంలకు లీజుకు ఇవ్వడం మరో అక్రమం. వాస్తంగా 1/70 చట్టం అమలు ఉన్న ప్రదేశంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేయవద్దు.  

నాళా కన్వర్షన్ తప్పనిసరి

ఇంటి నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వాలంటే ముందు నాళా కన్వర్షన్ తప్పనిసరి. నాళా కన్వర్షన్ ఇవ్వనిదే దరఖాస్తు ఆన్‌లైన్‌లో స్వీకరించదు. దీంతో ఇంటి నిర్మాణాలకు అనుమతులు అసాధ్యమని తెలుస్తోంది. అలా నిర్మించిన ఇళ్లకు ఇంటి నంబ ర్ ఎలా కేటాయిస్తున్నారు, కేటాయి స్తే దానికి తగిన ఆధారాలు ఏమిటి, వ్యాపార సముదాయానికి ఇస్తున్నా రా, గృహానికి ఇస్తున్నారా, ఇంటి ప న్ను వసూలు ఏ విధంగా చేస్తున్నారనే ప్రశ్నలకు సమాధానం దొర కడంలేదు. చట్టాలు చేసే ప్రజాప్రతినిధులు, అమలు చేసే అధికారుల్లో అక్రమార్కులు అండగా ఉన్నంత కాలం చట్టాల అమలు మేడిపండు సామేతే అనేది ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలే సాక్షం.

అనుమతులు ఇవ్వడంలేదు

చుంచుపల్లి మండలంలోని విద్యానరగ్ కాలనీలో ఇంటి నిర్మాణాలకు ఎలాంటి అనుముతులు ఇవ్వడం లేదని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిర్మాణాలు జరుగు తుంటే చర్యలు తీసుకుంటున్నారా అని అడిగితే సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. నోటీసులు ఇచ్చారా అని అడిగితే తాను కొత్తగా వచ్చానని, గతంలో ఇచ్చే ఉంటారని చెప్పారు.