calender_icon.png 24 October, 2024 | 10:01 PM

25 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. రెండు సంవత్సరాలకే మరమ్మతులు

12-09-2024 02:28:40 PM

నాణ్యత లోపంతో ప్రయాణికులకు శాపం

బ్రిడ్జి నిర్మించిన కాంట్రాక్టర్ తో మరమ్మతులు చేపిస్తామంటున్న అధికారులు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు పై నిర్మించిన బ్రిడ్జి  తీరిది

కామారెడ్డి (విజయక్రాంతి): కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెనలు రెండు సంవత్సరాలకే పగుళ్లు ఏర్పడి మరమ్మతులకు దారి తీసిన సంఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుపై నిర్మించిన వంతెన తీరిది. 25 కోట్లతో రెండు సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెన బీటలు వారి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పది కాలాలపాటు ఉండాల్సిన వంతెన నిర్మాణం కాంట్రాక్టర్ నాణ్యత లోపంతో నిర్మించడం వల్లే రెండు సంవత్సరాలకే వంతెన బీటలు పడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అధికారులు కాంట్రాక్టర్ కుమ్మక్కై నాణ్యత లోపంతో బ్రిడ్జి నిర్మించాలని అందుకే రెండు సంవత్సరాలకే వంతెన బీటలు వారిందని స్థానికులు వాపోతున్నారు . వంతెన నిర్మించిన కాంట్రాక్టర్ తోనే మరమ్మతు పనులు చేపడుతున్నామని ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు. వర్షాల వల్ల పెద్ద వాహనాలు లోడుతో వెళ్లడం వల్ల వంతెన గుంతల మయంగా మారిందని ఐదు సంవత్సరాలు గ్యారంటీ ఉందని ఏది జరిగిన కాంట్రాక్టర్  బాధ్యుడు అవుతాడని అధికారులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో రోడ్డు బంద్ చేసి వంతెన నిర్మించిన కాంట్రాక్టర్ తో మర మత్తు పనులు చేపిస్తున్నట్లు ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు. స్థానికులు మాత్రం 25 కోట్లతో నిర్మించిన వంతెన రెండు సంవత్సరాలకే గుంతలు పడడం ఏమిటని ఏ విధంగా నాణ్యతతో నిర్మించారో అర్థం అవుతుందని తెలిపారు. నాణ్యతలేని పనులు చేపట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.