వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకుంటే.. డీఎఫ్‌ఓ ఆఫీస్‌ని ముట్టడిస్తాం
* అడవి శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు సాగని బ్రిడ్జి పనులు..
* అల్లి కోరి గ్రామస్తుల ఆగ్రహం
ఉట్నూర్, మే 24( విజయక్రాంతి): దేవుడు వరమిచ్చిన... పూజారి కరుణించని చందంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అల్లికోరి గ్రామస్తుల పరిస్థితి నెలకొంది... ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే బయట ప్రపంచానికి రావాలంటే ప్రాణాలను అరచేతుల పెట్టుకొని బయట ప్రపంచానికి వస్తున్నాం.. అల్లికోరి గ్రామంలో నిండు గర్భిణీ ప్రసూతి కోసం వర్షాకాలంలో తీసుకువెళ్లాలంటే ఎడ్ల బండిపై ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వాగు దాటి వెళ్తున్నామని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తే వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని అల్లికోరి గ్రామ పటేల్ సేద్మకి గంగారాం తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాజర్శి షా మంజూరు చేసిన నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి కాంట్రాక్టర్ వస్తే ఇంద్రవెల్లి రేంజ్ అడవి శాఖ అధికారులు పనులను అడ్డగించారని , పనులు చేయవద్దని ఆదేశాలు జారీ చేయడంపై గ్రామ గిరిజనులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ గ్రామానికి గత ఏడాది బీటీ రోడ్డు నిర్మాణానికి 59 లక్షలు మంజూరు అయితే ఆ పనులను అడ్డగించడంతోపాటు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి మంజూరైన 30 లక్షల రూపాయల పనులను సైతం అడవి శాఖ అధికారులు అడ్డుకున్నారని గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తూ వాగు వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు.. తమ గ్రామానికి వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతాయని ఇప్పటికైనా అడవి శాఖ అధికారులు గుర్తించి మంజూరైన నిధులతో పనులు సాగే విధంగా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు..
* డిఎఫ్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం..
* జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన నిధులతో బ్రిడ్జి నిర్మాణం పనులను అడ్డుకుంటే జిల్లా కేంద్రానికి వెళ్లి అక్కడ డిఎఫ్‌ఓ కార్యాలయాన్ని పిల్లాపాపలతో ముట్టడిస్తామని అల్లి కోరి గ్రామ పటేల్ గంగారాం తో పాటు గోధురు, సోయం మీరాబాయి, మెస్రం నాగులు హెచ్చరించారు.
ఆదివారం వాగు వద్ద గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ.. గ్రామపంచాయతీ తీర్మానం మేరకు జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేస్తే అడవి శాఖ అధికారులు తమ స్వార్థం కోసం పనులు నిలిపివేశారని, ఈసారి తమ గ్రామంలో వర్షాకాలంలో ప్రసూతి అయ్యే గర్భిణీలు ఉన్నారని , వారు ప్రసూతి అయ్యే సమయంలో వాగు పొంగిపొర్లాడితే వారిని ప్రసూతి కోసం తీసుకు వెళ్లడం కష్టంగా ఉంటుందని గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేశారు.
గత ఏడాది వర్షాకాలంలో ఈ వాగు దాటి నిండు గర్భిణీ ఇంద్రవెల్లి పీఎస్ కు తీసుకు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడవలసి వచ్చిందని, వాగు పక్కనే నిండు గర్భిణి పాపకు జన్మనిచ్చిన విషయాన్ని సైతం కలెక్టర్ దృష్టికి తీసుకు వెళితే తమ గ్రామ సమస్యలను క్షుణ్ణంగా విని బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదల చేశారని గ్రామస్తులు అన్నారు.
కనీసం మానవత్వం లేని అడవి శాఖ అధికారులు వాగు పై బ్రిడ్జ్ పనులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నించారు. రెవెన్యూ పరిధిలోకి వచ్చే వాగుతో పాటు తమ సాగు భూములు సైతం రెవెన్యూ పట్టాలు ఉన్నాయని , ఈ విషయాన్ని సైతం అడవిశాఖ అధికారులు గుర్తించక తమ గ్రామాభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని వంతెన తో పాటు బీటీ రోడ్డు పనులు ప్రారంభించాలని ఉన్నత అధికారులు కోరారు.






