calender_icon.png 16 January, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్గాం వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెట్టాలి

05-09-2024 05:00:05 PM

సీఎంకి బహిరంగ లేక విడుదల చేసిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు

మంచిర్యాల,విజయక్రాంతి : మంచిర్యాల పట్టణం కాలేజ్ రోడ్డు మీదుగా అంతర్గాం కు గోదావరి నదిపై నిర్మించే బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్ల దివాకర్ రావు అన్నారు. గురువారం తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారూ. మంచిర్యాల - అంతర్గాం గోదావరి నదిపై రూ.164 కోట్లతో మంజూరు, అగ్రిమెంట్ అయిన బ్రిడ్జి పనులు మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని, దీని వలన హైదరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ప్రయాణం చేసే వారికి 18 కిలో మీటర్ల దూరం తగ్గుతుందన్నారు.  స్థానిక ఎమ్మెల్యే ఈ బ్రిడ్జిని ముల్కల్ల నుంచి ముర్మూర్ మీదుగా నిర్మించాలని ప్రతిపాదన చేస్తున్నారని, ముల్కల్ల నుంచి ముర్మూర్ మీదుగా అంతర్గాం వరకు గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపడితే రూ.450 కోట్ల రూపాయల ఖర్చు, 8 కిలో మీటర్ల మేరకు భూ సేకరణ చేయాల్సి ఉంటుందన్నారు.

ఇవన్నీ చేసినా హైదరాబాద్ వెళ్లడానికి కేవలం 5 కిలో మీటర్ల దూరం మాత్రమే తగ్గుతుందని, ఈ ప్రతిపాదన వెంటనే విరమించుకొని గతంలో మాదిరిగానే మంచిర్యాల - అంతర్గాం పైననే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. మంచిర్యాల పట్టణం గోదావరి నదిని ఆనుకొని ఉన్నదని, అవతలి వైపు పెద్దపెల్లి జిల్లాలో అంతర్గాం అనే గ్రామం ఆనుకొని గోదావరి నది వరకు పురాతనమైన ఆర్ అండ్ బీ డబుల్ రోడ్డు ఉందని, మంచిర్యాల జిల్లా ప్రజలు, బెల్లంపెల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజక వర్గాలు, చంద్రపూర్ (మహారాష్ట్ర) ప్రజలు హైదరాబాద్ కు గోదావరిఖని నుంచి రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వెళ్ళే వారు, మంచిర్యాల-అంతర్గాం గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం వలన 18 కిలో మీటర్ల దూరం తగ్గుతుందన్నారు. దీని వలన సమయభారం, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకు ప్రయాణ ఖర్చులు కూడా తగ్గి సుఖవంతమైన ప్రయాణానికి ఆస్కారం ఉందన్నారు. 

దీనిని మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపెల్లి జిల్లా ప్రజలు నూటికి నూరు శాతం కోరుకుంటున్నారన్నారు. మీరు కావాలంటే ఈ బ్రిడ్జి నిర్మాణము యొక్క ఆవశ్యకతను ప్రజలతో అభిప్రాయ సేకరణ కూడా చేయించవచ్చునన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి అయి దూరాభారం తగ్గాలని మూడు జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారనీ,  అన్ని అనుమతులు వచ్చి, టెండర్ ప్రక్రియ పూర్తి అయి, కాంట్రాక్టరు పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉన్న సందర్భంలో బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేక విడుదల చేస్తూ వెంటనే బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు గాదె సత్యం, మంచిర్యాల మున్సిపల్ ఫ్లోర్  లీడర్ అంకం నరేష్, కౌన్సిలర్లు సుంకరి శ్వేతా-రమేష్, హఫీజ్ ఆ బేగం-తాజుద్దీన్, పంబల గంగా-ఎర్రన్న, హాజీపూర్ మండలం అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, హాజీపూర్ మాజీ ఎంపీపీ స్వర్ణలత-శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.