calender_icon.png 9 January, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శతక్కొట్టిన బ్రీత్ ఎనలైజర్లు

02-01-2025 03:19:41 AM

  • పరుగులు పెట్టించిన మందుబాబులు 

పంజాగుట్టలో ఓ వాహనదారుడికి 550 రీడింగ్ 

నాంపల్లిలో పరుగులు పెట్టిన ఆటోవాలా 

తనకింకా పెళ్లి కాలేదంటూ మరొకరి ఆవేదన 

మూడు కమిషనరేట్ల పరిధిలో 2,642 కేసులు 

సిటీ పరిధిలో మందుబాబుల హంగామా

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని మందుబాబులు నానా హంగామా చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ గతేడాది కంటే ఈ ఏడు అత్యధికంగా పట్టుబడ్డారు. డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించారు. అనేక చిత్ర, విచిత్రమైన ఘటనలు చూడాల్సి వచ్చింది.

ఓ వాహనదారుడు తాగిన తాగుడికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో  ఏకంగా 550 రీడింగ్ చూయించింది. మరో వాహనదారుడు తన వెహికల్‌ను వదిలేసి పరుగులు పెట్టగా, పోలీసులు సైతం అతని వెంట పరుగెత్తాల్సి వచ్చింది. మరోచోట నాకింకా పెండ్లి కాలేదు.. నన్ను వదిలేయండి సార్ అంటూ వేడుకున్న సీన్ కనిపించింది. నగరంలోని పలు చోట్ల వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌కు నిరాకరించి మొండికేశారు.

పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేసినా.. అవేమీ పట్టించుకోని మద్యంప్రియులు పూటుగా తాగి వేలాదిగా పట్టుబడ్డారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఒక్కరోజే 2,642 కేసులు నమోదయ్యాయి.

2,642 కేసులు నమోదు 

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 2,642 మంది మద్యం సేవించి పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,184, సైబరాబాద్‌లో 839, రాచకొండలో 619 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పరిధిలో నలుగురికి 500కి పైగా, 24 మందికి 300, 366 మందికి 100కి పైగా రీడింగ్ నమోదైంది. వీరిలో 685 టూ వీలర్లు, 18 త్రీ వీలర్లు, 131 ఫోర్ వీలర్లు, 5 భారీ వాహనాలు ఉన్నాయి.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో 526 టూ వీలర్లు, 26 త్రీ వీలర్లు, 64 ఫోర్ వీలర్లు, మూడు భారీ వాహనాలు ఉన్నాయి. ఎల్‌బీ నగర్, మహేశ్వరంలలో ఇద్దరు మైనర్లు పట్టుబడ్డారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా ఎల్‌బీనగర్‌లో 232 మంది, మల్కాజిగిరిలో 230 మంది పట్టుబడ్డారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా ఈస్ట్‌జోన్‌లో 236, సౌత్‌ఈస్ట్ జోన్‌లో 192, వెస్ట్ జోన్‌లో 179, సౌత్ వెస్ట్ జోన్‌లో 179, నార్త్ జోన్‌లో 177, సెంట్రల్ జోన్‌లో 102 కేసులు నమోదయ్యాయి. మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 19 ప్రకారం నేరస్తుల డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయాలని కోరుతూ రవాణా శాఖకు పంపుతామని పోలీసు శాఖ వెల్లడించింది.

ఆల్ టైం రికార్డు

ప్రజలు తమ రోజువారీ పనుల్లో అలిసిపోతే.. కాస్తా రిలీఫ్ కోసం ఓ పెగ్గు వేసు  సాధారణం. ఈ సమయంలో పోలీసులు జరిపే డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోతే నానా యాగీ చేస్తారు. కానీ, తెల్లారితే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుందని డిసెంబర్ 31 రాత్రి జరిగే మందు పార్టీలను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిసెంబర్ 31 (మంగళవారం) రాత్రి పోలీసులు జరిపిన డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో అనేక ఆసక్తి కరమైన అంశా  వెలుగులోకి వచ్చాయి.

పంజాగుట్ట పోలీసులు వెంగళరావు పార్కు వద్ద జరిపిన డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో పంజాగుట్టకు చెందిన ఓ వాహనదారుడి రీడింగ్ చూసి పోలీసులే అవాక్కై నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. తనకు చేసిన బ్రీత్ ఎనలైజర్ టెస్టులో 550 ఎం  రీడింగ్ నమోదై ఆల్ టైం రికార్డుగా సంచలనంగా మారింది. మరో నలుగురికి 500 రీడింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. ఈ సమయంలో మద్యం సేవించి పోలీసులకు పట్టుబడితే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని..

తాగి పట్టుబడ్డాడని ఎక్కడ పరువు పోతుందోనని మద్యం సేవించిన వాహనదారులు నానా హంగామా సృష్టించారు. నాంపల్లిలోని ఓ ఆటో వాలాతో పాటు పలువురు వాహనదారులు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే పోలీసులు వెంబడించి పట్టుకోవాల్సి వచ్చింది. అమీర్‌పేట ప్రాంతంలో ఓ వాహనదారుడు తనకింకా పెళ్లి కాలేదని.. నన్ను వదిలి పెట్టాలని పోలీసులను బ్రతిమాలుకున్నాడు.