80తులాల బంగారం, రూ.2లక్షల నగదు అపహరణ
కూకట్‌పల్లిలో ఘటన
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (విజయక్రాంతి): కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి జయనగర్ కాలనీ సీతాప్యాలెస్ అపార్ట్‌మెంట్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇంటి తాళాన్ని పగులకొట్టి బీరువాలోని 80తులాల బంగారు ఆభరణాలు, రూ.2లక్షల నగదును దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు.. జయనగర్ కాలనీ సీతాప్యాలెస్ అపార్ట్‌మెంట్ డోర్ నంబర్ 301లో మధుసూధన్‌రెడ్డి అనే బిల్డర్ కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. నాలుగురోజుల క్రితం మియాపూర్‌లో నివాసముంటున్న అతడి కుమార్తె ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.
అయితే మధుసూధన్‌రెడ్డి మాత్రం ప్రతిరోజు సాయంత్రం జయనగర్ కాలనీలోని ప్లాట్‌కు వచ్చి వెళ్తుండేవాడు. శుక్రవారం ఉదయం ఏడుగంటలకు అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్.. మధుసూధన్‌రెడ్డికి ఫోన్‌చేసి ఆయన ఇంటి తలుపులు తెరిచి ఉన్నట్లు చెప్పారు. మధుసూధన్‌రెడ్డి వెంటనే అక్కడికి చేరకొని వస్తువులు చిందరవందరగా పడిఉండటంతో పాటు బీరువాలోని బంగారం, నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఈ మేరకు కూకట్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ కొత్తపల్లి ముత్తు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశం ఇంటిని పరిశీలించారు.కేసు దర్యాప్తు చేస్తున్నారు.