ముందుకొచ్చిన దాత తన్నీరు రమేశ్ వెల్దుర్తి జడ్పీహెచ్‌ఎస్‌లో అమలు
వెల్దుర్తి, జనవరి 10: అర్ధాకలితో అలమటిస్తున్న పదవ తరగతి విద్యార్థుల దుస్థితిపై విజయక్రాంతి దినపత్రికలో ఈనెల 8న అర్ధాకలితో ప్రత్యేక చదువులు అనే శీర్షికన జిల్లా ప్రతినిధి ప్రచురించిన కథనానికి దాతలు స్పందించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ నాయకుడు, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ తన్నీర్ రమేష్ ముందుకొచ్చి రోజు జరిగే పదవ తరగతి ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు అల్పాహారం అందజేస్తానని విజయక్రాంతితో చెప్పారు.
వెల్దుర్తి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో ఉదయం ప్రత్యేక తరగతుల కొరకై 140 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేక తరగతులు మొదలైనప్పటినుండి వారికి అల్పాహారం అందజేయడం లేదు. విజయక్రాంతిలో వచ్చిన కథనానికి స్పందనగా తన్నీరు రమేశ్ ఈ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు సిద్దమయ్యారు.
పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు అల్పాహారం అందిస్తానని హామీనిచ్చారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారి ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చిన రమేశ్ను మండల విద్యాధికారి అరికల యాదగిరి, పాఠశాల హెచ్‌ఎం సాంబయ్య, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మంచి కథనాన్ని అందించిన విజయక్రాంతిని పలువురు అభినందించారు.