calender_icon.png 26 October, 2024 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానేరు రివర్‌ఫ్రంట్‌కు బ్రేక్

05-08-2024 02:00:27 AM

  1. బీఆర్‌ఎస్ హయాంలో పనులు ప్రారంభం 
  2. రూ.410 కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం 
  3. రిటైనింగ్ వాల్‌ల నిర్మాణం పూర్తి 
  4. ప్రస్తుతం నిధులు విడుదల చేయని కాంగ్రెస్.. 
  5. నిలిచిన మిగిలిన పనులు

కరీంనగర్, ఆగస్టు 4 (విజయక్రాంతి): కరీంనగర్ తలాపున రూ.410 కోట్లతో చేపట్టిన మానేరు రివర్‌ఫ్రంట్ నిర్మాణానికి బ్రేక్ పడినట్లయింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించగా.. అప్పటి మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పట్టుబట్టి దీన్ని సాధించారు. కరీంనగర్‌ను పర్యాటకరంగంగా తీర్చిదిద్దేందుకు మానేరు డ్యాం నుంచి తీగల వంతెన వరకు రివర్‌ఫ్రంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఇరువైపులా రిటైనింగ్ వాల్‌ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

రూ.410 కోట్లలో రూ.318 కోట్లు నీటి పారుదలశాఖకు, రూ. 102 కోట్లు పర్యాటక శాఖకు గత ప్రభుత్వం కేటాయించింది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు రూ.190 కోట్ల బిల్లుల చెల్లింపు పూర్తయ్యాయి. అయితే ప్రాజెక్టు పనులు పూర్తికావాలంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుందని ఆశించారు. మానేరు రివర్‌ఫ్రంట్  ప్రస్తావన రాకపోవడంతో బ్రేక్ పడినట్లయింది. పర్యాటకశాఖ ద్వారా రూ.70 కోట్ల రూపాయలతో అత్యాధునిక హంగులతో చేపట్టాలనుకున్న ఫౌంటెయిన్ పనులకు గత పాలకులు శంకుస్థాపన చేశారు కానీ నిధుల లేమితో పనులు ముందుకు సాగలేదు. 

సబర్మతి తరహాలో..

అహ్మదాబాద్‌లోని సబర్మతి తరహాలో కరీంనగర్ ముఖద్వారంగా దిగువ మానేరు జలాశయం ముందుభాగం మానేరు నదిపై ఉన్న రెండు వంతెనల మధ్య మానేరు రివర్‌ఫ్రంట్‌ను తీర్చిదిద్దాలనుకున్నారు. ఇరు వైపులా అందమైన పార్కులు, వాటర్ ఫౌంటెయిన్లు, థీమ్ పార్కులు, మ్యూజికల్ ఫౌంటెయిన్లు, ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని గత పాలకులు నిర్ణయించారు.

ఈ రివర్‌ఫ్రంట్‌లో 12 నుంచి 13 మీటర్ల లోతులో నీటి నిల్వ ఉంచి స్పీడ్ బోట్లు, క్రూయిజ్ బోట్లను ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని నిర్ణయిం చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023 ఆగస్టు 15 నాటికే పూర్తిచేయాలని అనుకున్నప్పటికి సాధ్యంకాలేదు. ప్రస్తుత ప్రభుత్వం కనికరిస్తేకాని ఆ పనులు జరిగేలా లేవు. నిధులు కేటాయించకపోవడంతో ఈ బృహత్తర ప్రాజెక్టు పూర్తయ్యేనా అన్న అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. 

దెబ్బతిన్న తీగల వంతెనతో విమర్శలు

ఈ ప్రాజెక్టు సంగతి అటుంచితే ఇప్పటికే పూర్తిచేసిన తీగల వంతెన వర్షాలకు దెబ్బతినడం, డైనమిక్ లైట్లు వెలగకపోవడం పలు విమర్శలకు దారితీసింది. తీగల వంతెనలాగా రివర్‌ఫ్రంట్ కూడా పనికిరాకుండా పోతుందన్న విమర్శలొస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత రివర్‌ఫ్రంట్‌పై విజిలెన్స్ విచారణ జరపాలని భావించినప్పటికీ వెనక్కి తగ్గింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పం కనిపించడం లేదు. ప్రభుత్వం మారితే ప్రాజెక్టును పట్టించుకోకపోవడం సరికాదని, ప్రాజెక్టును పూర్తిచేసి కరీంనగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరుతున్నారు.

ఎల్‌ఎండీలో నీటి నిల్వ ఉంటేనే..

ఎల్‌ఎండీలో ఆశించిన మేర నీటి నిల్వలు ఉంటేనే మానేరు రివర్ ఫ్రంట్ లో ఎప్పటికీ నీరు నిల్వ ఉంచవచ్చు. ఎల్‌ఎండీ దిగువన 10 కిలోమీటర్ల మేర నీళ్లు నిలిపి అందమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఇక్కడ నీటిని నిల్వ ఉంచేందుకు వీలుగా గ్యారేజ్ తరహాలో చెక్‌డ్యాంను నిర్మించి నాలుగు గేట్లు అమర్చాలని నిర్ణయించారు. సగం మేర 210 మీటర్ల దూరంలో దానికి ఆనుకుని 190 మీటర్ల గోడతో కూడిన చెక్ డ్యాంను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరువైపులా పలుచోట్ల నీటిని తాకేలా మెట్లను కూడా నిర్మించాలనుకున్నారు. అయితే ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. డ్యాం మధ్యలో ఉన్న బండరాళ్లను కూడా తొలగించవలసి ఉంది.