calender_icon.png 6 April, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కట్ట తెంపి.. సాఫ్‌జేసి!

05-04-2025 12:25:40 AM

  • పట్టణాల్లో భూములకు భారీ డిమాండ్
  • చెరువు కట్టలనూ వదలని భూమాఫియా
  • చోద్యం చూస్తున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు

మహబూబ్నగర్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): పట్టణ ప్రాంతాల్లో భూములకు డిమాండ్ పెరుగుతుండటంతో అక్రమార్కలు ఎంతకు తెగించేందుకైనా సిద్ధపడుతు న్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. చివరకు చెరువు కట్టలనూ వదలడం లేదు. సర్కారు భూములను రక్షిస్తున్నామని ప్రభుత్వాలు ఊదరగొ డుతున్నా.. భూమాఫియా చెలరేగిపోతున్నది.

రాత్రికి రాత్రే గుట్టలను మాయంచేస్తున్నారు.. చెరువు కట్టలను కనుమరుగు చేస్తున్నారు. మహబూబ్నగర్ పట్టణ కేంద్రం లో ప్రకృతి విధ్వంసానికి కొందరు రియల్ వ్యాపారులు అడుగులు వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులకు చీమకుట్టినట్టునా అనిపించకపోవడం విచారకరం. 

చెరువు ఖాళీ చేసి..

మహబూబ్నగర్ పట్టణానికి సమీపంలో మౌలాలి గుట్ట ప్రాంతం ఉంది. ఇక్కడి ప్రభుత్వ భూముల్లో డబల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. ఈ ప్రాంతంలోనే కోరంగడ్డ కుంట సర్వే నంబర్ 403లో ఉంది. ఈ కుంట విస్తీర్ణం తక్కువ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా కట్ట ఉంది. ఈ భూమి చాలా విలువైంది. ఈ కోరంగడ్డ కుంట పక్కనే ఉన్న ఇతర సర్వే నంబర్లలో గల భూమి ఉన్న వ్యక్తి కుంట కట్టను తొలగించారు.

చెరువులోపల కూడా కొంత భాగంలో మట్టి పోశారు. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత అధికారులు సాఫీగా సరిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను పర్యవేక్షించా ల్సిన నీటిపారుదల శాఖ అధికారులు అటువైపు చూడటమే మానేశారని ఆరోపణలు ఉన్నాయి. పట్టణానికి సమీపంలోనే చూసీచూడనట్టు వ్యవహరిస్తే.. దూరప్రాంతాల్లో పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇకనైనా అధికారులు సమర్థంగా విధులు నిర్వహించి, ఆక్రమణలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

పోలీసులకు ఫిర్యాదు చేశాం

కోరంగడ్డ కుంట కట్ట తొలగించినట్టు మా దృష్టికి వచ్చింది. వచ్చిన వెంటనే ఆ కుంట కట్టను పరిశీలించాం. కట్టను తొలగించింది వాస్తవం. దాదాపుగా 100 మీటర్లు పొడవు ఈ కట్ట ఉండేది. తొలగించిన వారిపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని పోస్ట్లో ఫిర్యాదు చేశాం. పోలీసులు నేరుగా ఫిర్యాదు చేయాలని మా ఏఈకి చెప్పినట్టు తెలిసింది. సోమవారం వెళ్లి ఏఐ నేరుగా పీఎస్లో కేసు నమోదు చేయిస్తాం. ముందు ఎలా ఉందో అలానే మళ్లీ కట్ట నిర్మిస్తాం. కుంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. 

 మనోహర్, నీటిపారుదల శాఖ డీఈ, మహబూబ్ నగర్ సర్వే చేసి నివేదిక అందజేశాం

కుంటకు సంబంధించి ఎంత భూమి ఉందో  సర్వే చేసి నివేదికను తహసిల్దార్కు అందజేశాం. చెరువు భూభాగాన్ని అన్ని కోణాల్లో పరిశీలించాం. ప్రస్తుతం కుంటలో కూడా కొంతమేరకు నీరు ఉంది. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కుంటకు సంబంధించి భూమి సర్వే పూర్తి చేశాం. 

 నర్సింగ్, ఆర్‌ఐ, అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, మహబూబ్ నగర్