అడ్డుతగిలిన యాపిల్
న్యూఢిల్లీ: దేశీయంగా తన వాటాను టాటా గ్రూపునకు విక్రయించాలని భావించిన చైనా మొబైల్ తయారీ కంపెనీ వివో ఆశలపై యాపిల్ నీళ్లు చల్లింది. వాటాలు కొనుగోలుకు టాటా గ్రూప్ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ఆ సంస్థ వ్యాపార భాగస్వామి యాపిల్ మాత్రం సానుకూలంగా లేదు. దీంతో ఈ డీల్ నిలిచిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశీయ కార్యకలాపాలను టాటాలకు అప్పగించి ప్రభుత్వ ఒత్తిళ్ల నుంచి బయటపడదామని భావించిన వివోకు ఆశాభంగం ఎదురైంది.
చాలా ఏళ్లుగా దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివో.. వీటిల్లో 51 శాతం వాటాను టాటా గ్రూప్‌నకు విక్రయించాలని నిర్ణయించింది. తద్వారా తన కార్యకలాపాలకు ’దేశీ’ టచ్ ఇవ్వాలని భావించింది. ఇందులో భాగంగా టాటా గ్రూపుతో చర్చలు జరిపింది. ప్రస్తుతం ఐఫోన్లను తయారు చేస్తున్న టాటా గ్రూప్‌నకు యాపిల్ వ్యాపార భాగస్వామిగా ఉంది. ఈ డీల్ పట్ల ఆ సంస్థ సానుకూలంగా లేకపోవడంతో టాటా గ్రూప్ తన ప్రయత్నాలను విరమించుకుందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ’టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనాన్ని ప్రచురించింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్‌కు వివో కూడా ఓ పోటీదారుగా ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది.
ఇప్పటికైతే ఈ డీల్ ముందుకెళ్లే సూచనలేవీ కనిపించడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.చైనా నుంచి వచ్చే పెట్టుబడులపై కేంద్రం నుంచి ఆంక్షలు ఉన్నాయి. భారత్‌లో కార్యకలాపాల నిర్వహణలో నిర్వహించడంలో ఆ దేశ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నియంత్రణ సంస్థల నుంచి విచారణల రూపంలో ఒత్తిళ్లూ ఎదురవుతున్నాయి. దీంతో ఆయా కంపెనీలు దేశీయ సంస్థలకు తమ వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి.
తద్వారా ’మేకిన్ ఇండియా’లో భాగస్వామ్యం అవ్వడమే కాకుండా ఫండింగ్, వీసాలు పొందడమూ సులువు అవుతుంది. ఈ క్రమంలోనే ఎంజీ మోటార్ మాతృ సంస్థ సియాక్ మోటార్ మెజారిటీ వాటాలను జేఎస్ డబ్ల్యూ గ్రూపునకు విక్రయించాలని నిర్ణయించింది. వివో సైతం అదే తరహా ప్లాన్ చేసినప్పటికీ.. యాపిల్ రూపంలో బ్రేక్ పడింది.