calender_icon.png 1 October, 2024 | 10:55 PM

రికార్డు ర్యాలీకి బ్రేక్

14-09-2024 02:54:29 AM

స్వల్పంగా తగ్గిన సూచీలు

ముంబై, సెప్టెంబర్ 13: గత ట్రేడింగ్ సెషన్‌లో రికార్డు ర్యాలీ జరిపిన స్టాక్ సూచీలు శుక్రవారం బ్రేక్ తీసుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో రెండు ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసాయి. గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ చరిత్ర లో తొలిసారిగా 83,000 శిఖరాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తాజా సెషన్‌లో పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన సెన్సెక్స్ చివరకు 71 పాయింట్ల నష్టంతో 82,895 పాయింట్ల వద్ద నిలిచింది.

ఇంట్రాడేలో ఈ సూచీ 309 పాయింట్లు తగ్గి 82,653 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 25,356 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,707 పాయింట్లు, నిఫ్టీ 504 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. 

లాభాల స్వీకరణ

అయిల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో జరిగిన లాభాల స్వీకరణ కారణంగా సూచీలు స్వల్పంగా తగ్గాయని, ఇక ఇన్వెస్టర్లు వచ్చేవారం జరగనున్న ఫెడ్ మీట్‌వైపు దృష్టిపెడతారని మెహతా ఈక్విటీస్  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు.  భారీ ర్యాలీ అనంతరం మార్కెట్ విరామం తీసుకున్నదన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి జోరుగా పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు వస్తున్నందున దేశీయ సెంటిమెంట్ పాజిటివ్ గానే కొనసాగుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు. 

అదానీ పోర్ట్స్ టాప్ లూజర్

యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ అదా నీ గ్రూప్‌పై చేసిన తాజా ఆరోపణల కారణంగా పలు అదానీ గ్రూప్ షేర్లు క్షీణించా యి. సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా అదానీ పోర్ట్స్ 1.4 శాతం పడిపో యింది. ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యూనీలీవర్, ఎన్టీపీసీ, మారుతి, ఏషి యన్ పెయింట్స్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, లార్సన్ అండ్ టుబ్రోలు నష్టాలతో ముగిసా యి.  మరోవైపు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రాలు 2 శాతం వరకూ లాభపడ్డాయి.

వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.55 శాతం క్షీణించింది. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.54 , యుటిలిటీస్ ఇండెక్స్ 0.96 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 0.35 శాతం,  పవర్ ఇండెక్స్ 0.28 శాతం చొప్పున తగ్గాయి. రియల్టీ, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 0.95 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.48 శాతం చొప్పున పెరిగాయి.