- 3 నెలల వరకు నోటిఫికేషన్ల జారీ కష్టమే
- ఎస్సీ వర్గీకరణ అంశం తేలాకే సర్కారు నిర్ణయం
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): ఎంతో ఆశగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు ఇది చేదువార్తే. ఈ ఏడాదిలో నోటిఫికేషన్ల జారీలో ఇంకొంత నిరీక్షణ తప్పేలా లేదు. నూతన సంవత్సరంలో ఇక వరుసగా వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతాయని భావించిన నిరుద్యోగుల ఆశలకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది.
దాదాపు మూడు నెలల వరకు ఎటువంటి నోటిఫికేషన్లు విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే అంశాన్ని అధికారిక వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ అమలుకు ఎస్సీ వర్గీకరణ అంశం ప్రధాన అడ్డంకిగా మారినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ ఈ అంశంపై కసరత్తు చేస్తోంది.
ఎస్సీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వస్తేగానీ నోటిఫికేషన్లకు లైన్ క్లియర్ అయ్యేట్టుగా కనిపించడంలేదు. ఉద్యోగ నియామక ప్రక్రియలో తీవ్రంగా జాప్యం జరుగుతుందనే భావన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉండేది. గ్రూప్స్ పరీక్షలు రద్దు, టీజీపీఎస్సీ పేపర్లు లీకేజీ ఘటనలు తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అంశం కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చింది.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్‌ను పక్కాగా అమలుచేస్తామని నిరుద్యోగులకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రకటించినట్లుగానే శాసనసభా సమావేశాల్లో భాగంగా గతేడాది ఆగస్టులో జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వెలువ డుతుంది? ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారనే వివరాలతో జాబ్‌క్యాలెండర్‌ను విడుద ల చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.
ఇక ఉద్యోగ నోటిఫికేషన్లకు సంవ త్సరాల తరబడి నిరీక్షించాల్సిన పనిలేదనుకున్నారు. ఎంచక్కా ఉద్యోగాలకు ప్రిపేపర్ కావొచ్చని అంతా అనుకున్నారు. కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి ప్రిపేరవుతుంటే, నిరు ద్యోగ అభ్యర్థులు హాస్టళ్లు, అద్దె రూముల్లో ఉంటూ కోచింగ్‌లు తీసుకుంటున్నారు.
ఇలా నెలల నుంచి సంవత్సరాల తరబడిగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నవారు అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేటతోపాటు రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, నల్లగొండ తదితర పట్టణాల్లో ప్రిపేరవుతున్న వారు లక్షల్లో ఉంటారు. ఎస్సీ రిజర్వేషన్ల అంశం తేలేంతవరకూ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆలస్యంగానే నోటిఫికేషన్లు..
2023 డిసెంబర్‌లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్.. బీఆర్‌ఎస్ హయాంలో వేసిన పలు నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియను పూర్తిచేయడంతోపాటు, కొన్ని కొత్త నోటిఫికేషన్లనూ వేసింది. గతేడాది అక్టోబర్ నెలలో గ్రూప్-1 నోటిఫికేషన్‌తోపాటు, సెప్టెంబర్‌లో ఏఈ, ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్లు వేయనున్నట్లు జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించారు.
కానీ, వాటి ఊసేలేదు. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించినట్లుగా జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్న నోటిఫికేషన్లు కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ రిజర్వేషన్ల అంశం తేలాకే ఈ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. మే లో నోటిఫికేషన్లు వెలువడే అవకాశముంది.
తొందరపడి నోటిఫికేషన్లు వేస్తే తర్వాత వచ్చే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయి కాబట్టి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. రిజర్వేషన్ల అమలు కోసం న్యాయ సలహాలను సైతం తీసుకుంటోంది. మరోవైపు జాబ్ క్యాలెండర్‌లో ప్రకటిం చినట్లుగా నోటిఫికేషన్లను వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
2025లో వెలువడే నోటిఫికేషన్ల వివరాలు
* గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్, ఏప్రిల్‌లో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది.
* ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్.. ఏప్రిల్‌లో పరీక్ష.
* ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్.. మేలో పరీక్ష.
* ఏప్రిల్‌లో టెట్ నోటిఫికేషన్.. జూన్‌లో పరీక్ష.
* జూలైలో గ్రూప్-1 మెయిన్స్ నోటిఫికేషన్ పరీక్ష (గతేడాది అక్టోబర్‌లోనే గ్రూప్-1 నోటిఫికేషన్ వేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తామని తెలిపింది.)
* ఏప్రిల్‌లో ఎస్‌ఐ నోటిఫికేషన్.. ఆగస్టులో పరీక్ష.
* ఏప్రిల్‌లో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్.. ఆగస్టులో పరీక్ష.
* జూన్‌లో డిగ్రీ కాలేజీలల్లో అకడమిక్ పోస్టులకు నోటిఫికేషన్.. సెప్టెంబర్‌లో పరీక్ష.
* జూన్‌లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లోని డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్.. సెప్టెంబర్‌లో పరీక్ష.
* మేలో గ్రూప్2 నోటిఫికేషన్.. అక్టోబర్‌లో పరీక్ష.
* జూలైలో గ్రూప్-3 నోటిఫికేషన్.. నవంబర్‌లో పరీక్ష.
* జూలైలో సింగరేణిలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నవంబర్‌లో పరీక్ష.