సెన్సెక్స్ 234 పాయింట్లు అప్
ముంబై, జనవరి 7: వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లుగా జరిగిన స్టాక్ మార్కెట్ పతనానికి మంగళవారం బ్రేక్‌పడింది. హెవీవెయిట్ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సన్ అండ్ టుబ్రోలు సూచీలను లాభాలతో గట్టెంక్కించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 487 పాయింట్లు జంప్‌చేసి 78,452 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. చివరకు 234 పాయింట్ల లాభంతో 78,199 పాయింట్ల వద్ద నిలిచింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 23,795 పాయింట్ల వద్ద గరిష్టస్థాయిని తాకిన అనంతరం చివరకు 92 పాయింట్ల లాభంతో 23,708 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. త్వరలో ఫలితాల సీజన్‌ను ప్రారంభించనున్న ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు జరగడం, డాలరు మారకంలో రూపాయి క్షీణత సూచీల లాభాల్ని పరిమితం చేసిందని ట్రేడర్లు తెలిపారు. సోమవారం సెన్సెక్స్ 1,258 పాయింట్లు, నిఫ్టీ 388 పాయింట్ల చొప్పున పడిపోయాయి.
సానుకూల గ్లోబల్ సంకేతాల నేపథ్యంలో క్రితం రోజు భారీ పతనం నుంచి దేశీయ మార్కెట్ కొంతమేర కోలుకున్నదని, అయితే కీలకమైన జీడీపీ అడ్వాన్సు అంచనాలు వెలువడనున్న నేపథ్యంలో పరిమిత శ్రేణిలో సూచీలు ట్రేడయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి నాలుగేండ్ల కనిష్ఠస్థాయి 6.4 శాతానికి తగ్గుతుందంటూ మార్కెట్ ముగిసిన తర్వాత జాతీయ గణాంకాల శాఖ అంచనాల్ని విడుదల చేసింది.
మార్కెట్ పెరిగినపుడల్లా అమ్మకాల ఒత్తిడి ఎదురవుతున్నదని, మార్కెట్ ఇంకా బేర్స్ పట్టులో ఉన్నదనడానికి ఇది సంకేతమని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. తాజాగా ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘైలు లాభపడ్డాయి. యూరప్ సూచీలు గ్రీన్‌లో ముగిసాయి.
క్యూ3 ఫలితాల ముందు జాగ్రత్త
వచ్చేవారం క్యూ3 ఫలితాల సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఇన్వెస్టర్లు ఐటీ షేర్లను విక్రయించి, లాభాల్ని స్వీకరించారని విశ్లేషకులు తెలిపారు. యూఎస్ డాలర్ పటిష్టత, భారత స్టాక్స్ అధిక విలువలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించబోదన్న అంచనాలు మార్కెట్ క్షీణతకు కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఈ నెల 9న టీసీఎస్, 13న ఇన్ఫోసిస్‌లు వాటి క్యూ3 ఆర్థిక ఫలితాల్ని ప్రకటిస్తాయి.
టాటా మోటార్స్ టాపర్
సెన్సెక్స్ ప్యాక్‌లో టాటా మోటార్స్ అన్నింటికంటే అధికంగా 2.25 శాతం పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, లార్సన్ అండ్ టుబ్రో, అదానీ పోర్ట్స్ 1.8 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు 2 శాతం వరకూ నష్టపోయాయి.
వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఎనర్జీ ఇండెక్స్ 1.55 శాతంపెరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.47 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 1.43 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 1.34 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 1.19 శాతం చొప్పున లాభపడ్డాయి. ఐటీ, టెక్నాలజీ సూచీలు తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.74 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.77 శాతం చొప్పున పెరిగాయి.