calender_icon.png 31 October, 2024 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికార్డుల ర్యాలీకి బ్రేక్

22-06-2024 12:05:00 AM

  • రుతుపవనాల మందగమనం పట్ల ఆందోళన l ఇంట్రాడేలో 676 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

న్యూఢిల్లీ, జూన్ 21: దేశంలో రుతుపవనాల కదలికలు మందకొడిగా ఉన్నందున ఆందోళనచెందిన ఇన్వెస్టర్లు ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో భారీ విక్రయాలు జరపడంతో స్టాక్ మార్కెట్ రికార్డుల ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌పడింది. వరుసగా ఆరు రోజులపాటు పెరిగి ఏ రోజుకారోజు కొత్త రికార్డుల్ని నెలకొల్పిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఎట్టకేలకు క్షీణతను చవిచూసింది. సెన్సెక్స్ శుక్రవారం ఇంట్రాడేలో 676 పాయింట్లు పతనమై 76,802 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది.

అయితే ఐటీ షేర్లకు లభించిన కొనుగోలు మద్దతుతో ట్రేడింగ్ ముగింపులో కొంతవరకూ కోలుకున్నది. చివరకు 269 పాయింట్ల నష్టంతో 77,210 పాయింట్ల వద్ద ముగిసింది.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 110 పాయింట్లు ర్యాలీ జరిపి 23,667 పాయింట్ల వద్ద కొత్త రికార్డుస్థాయిని నెలకొల్పిన తర్వాత నిలువునా పతనమై 23,400 పాయింట్ల దిగువన కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు 66 పాయింట్ల నష్టంతో 23,501 పాయింట్ల వద్ద నిలిచింది. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 217 పాయింట్లు, నిఫ్టీ 35 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.

లాభాల స్వీకరణ

రుతుపవనాల ప్రగతి మందకొడిగా ఉన్నదన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు మార్కెట్లో స్వల్పంగా లాభాల స్వీకరణ జరిపారని, అందుచేత ఎఫ్‌ఎంసీజీ రంగం షేర్లు క్షీణించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. తీవ్ర ఒడిదుడుకులతో సాగిన శుక్రవారంనాటి ట్రేడింగ్‌లో నిఫ్టీ తగ్గినప్పటికీ, ఆ సూచీకి ఇదే హయ్యస్ట్ వీక్లీ ముగింపు అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని చెప్పారు. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు కూడా శుక్రవారంనాటి ట్రేడింగ్‌పై ప్రభావం చూపినట్టు తెలిపారు. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీలన్నీ తగ్గాయి. యూరప్‌లో ప్రధాన మార్కెట్లయిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు నష్టాలతో ముగిసాయి. 

అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ లూజర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా అల్ట్రాటెక్ సిమెంట్ 2.7 శాతం నష్టపోయింది. లార్సన్ అండ్ టుబ్రో, టాటా మోటార్స్, నెస్లే, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 2.5 శాతం వరకూ తగ్గాయి. మరోవైపు  భారతి ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, ఎన్టీపీసీలు 1.5 శాతం వరకూ లాభపడ్డాయి.

వివిధ రంగాల సూచీల్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ అధికంగా 1.28 శాతం తగ్గింది. ఎఫ్‌ఎంసీజీ సూచి 1.08 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.96 శాతం, కమోడిటీస్ సూచి 0.92 శాతం,  రియల్టీ ఇండెక్స్ 0.75 శాతం, ఆటోమొబైల్ ఇండెక్స్ 0.71 శాతం చొప్పున తగ్గాయి.  టెలికమ్యూనికేషన్స్, ఐటీ, మెటల్, పవర్, టెక్నాలజీ, సర్వీసుల ఇండెక్స్‌లు పెరిగాయి.  బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం, స్మాల్‌క్యాప్ సూచి 0.06 శాతం చొప్పున తగ్గాయి. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు

వరుసగా నాలుగురోజులపాటు కొనుగోళ్లు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) శుక్ర వారం మాత్రం అమ్మకాలకు పాల్పడ్డారు.  గత నాలుగు రోజుల్లో రూ. 13,000 కోట్లకుపైగా నికర కొనుగోళ్లు జరిపిన ఎఫ్‌పీఐలు శుక్రవారం  రూ.1,790 కోట్ల నిధుల్ని మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.