calender_icon.png 27 November, 2024 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్ ర్యాలీకి బ్రేక్

27-11-2024 12:00:00 AM

స్వల్పంగా తగ్గిన స్టాక్ సూచీలు

ట్రంప్ టారీఫ్‌ల ఎఫెక్ట్

ముంబై, నవంబర్ 26: స్టాక్ మార్కెట్ వరుస రెండు రోజుల్లో జరిపిన భారీ ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడింది. చైనాపై టారీఫ్‌లను గతంలో ప్రకటించిన 60 శాతానికి అదనంగా మరో 10 శాతం పెంచుతానని, మెక్సికో, కెనడాలపై 25 శాతం టారీఫ్‌లను విధిస్తానంటూ యూఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు బలహీనపడ్డాయి. ఈ క్రమంలో భారత సూచీలు సైతం స్వల్ప నష్టాలతో ముగిసాయి. 

బీఎస్‌ఈ సెన్సెక్స్ 105 పాయింట్ల నష్టంతో 80,004 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో  24,194 పాయింట్ల వద్ద ముగిసింది. వరుస శుక్ర, సోమవారాల్లో సెన్సెక్స్ 2,000 పాయింట్లకుపైగా ర్యాలీ జరిపింది. మంగళవారం ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘైలు క్షీణించగా, హాంకాంగ్ స్వల్పంగా పెరిగింది. యూరప్ సూచీలు రెడ్‌లో ముగిసాయి. 

అదానీ పోర్ట్స్ టాప్ లూజర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 3.23 శాతం క్షీణించింది. అల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సన్ అండ్ టుబ్రో, పవర్‌గ్రిడ్‌లు 2 శాతం వరకూ తగ్గాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2 శాతం వరకూ లాభపడ్డాయి.

వివిధ రంగాల సూచీల్లో యుటిలిటీ ఇండెక్స్ 1.77 శాతం నష్టపోగా, పవర్ ఇండెక్స్ 1.55 శాతం, ఆటోమొబైల్ ఇండెక్స్ 1.26 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.93 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 0.64 శాతం చొప్పున తగ్గాయి. ఐటీ ఇండెక్స్ 1.11 శాతం లాభపడగా, టెక్నాలజీ ఇండెక్స్ 0.89 శాతం, టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 0.80 శాతం, మెటల్ ఇండెక్స్ 0.58 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 0.62 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.10 శాతం చొప్పున లాభపడ్డాయి.