calender_icon.png 31 October, 2024 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక క్వారీలకు బ్రేక్

25-07-2024 12:43:26 AM

  • కామారెడ్డి జిల్లాలో అనుమతించిన దానికంటే ఎక్కువగా తవ్వకాలు 
  • అక్రమాల వెనుక అధికార పార్టీ నేతలు! 
  • ఉన్నతాధికారులకు సొంతపార్టీ నేతల ఫిర్యాదు 
  • క్వారీల అనుమతుల రద్దు 
  • సహకరించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వేటు

కామారెడ్డి, జూలై 24 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పట్టపగలే కాకుండా రాత్రివేళల్లో సైతం అక్రమం గా ఇసుక రవాణ చేస్తున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో క్వారీలు నడిపిన వ్యక్తులు, వారికి అండగా నిలిచిన ప్రజాప్రతినిధుల క్వారీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన అనంతరం కాంగ్రెస్ నాయకుల అనుచరులు క్వారీలను దక్కించుకొని ఇసుక దందాను కొనసాగించారు.

గత మూడు నెలలుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అనుచరులు బిచ్కుంద, హస్గుల్, మంజీర పరివాహక ప్రాంతాల వద్ద ఉన్న ఇసుక క్వారీల నుంచి ప్రతీరోజు వందల లారీల ఇసుకను అక్రమ మార్గంలో తరలించేరు. వే బిల్లుల కంటే పదింతల రెట్టింపులో ఇసుకను లారీల్లో తరలించారు. అధికార పార్టీ అండదండలు ఉంటాయనే భయంతో అధికారులు కూడా వాటిని నిలువరించలేకపో యారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో స్థానిక తహసీల్దార్లు, పోలీసులు, మైనింగ్ అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి అక్రమ ఇసుక దందాను యథేచ్చగా నడిపించారు.

ఈ తతంగం మింగుడు పడని కొందరు స్థానిక నేతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ప్రభుత్వం సీరియస్ అయ్యిం ది. పర్మిషన్ పొందిన నాలుగు సంస్థలతో పాటు వారి అవినీతికి సహకరిస్తున్న ఐదుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. భూ యాజమానులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు.

ఇసుక దందా చేజారిందని...

పది సంవత్సరాలుగా ఇసుక క్వారీలకు అండగా నిలిచిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడు అడ్డగోలుగా ఇసుకను తరలించారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. అధికారులు వారిని ఎదిరించలేక వంత పడారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సదరు ప్రజాప్రతినిధి కొడుకు కాంగ్రెస్‌లోకి చేరితేనే భవిష్యత్ బావుంంటుందని ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. ఈ క్రమం లో కాంగ్రెస్ నాయకుల అనుచరులు నడుపిస్తున్న ఇసుక క్వారీలకు బ్రేక్ పెట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంతే కాకుం డా కాంగ్రెస్‌కు చెందిన ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ఇసుక క్వారీలలో వాటాలు కావాలని శత విధాలుగా ప్రయత్నించారు. అయితే క్వారీలు నడిపించే వ్యక్తులు, వారికి అండగా నిలిచిన కొందరు అధికార పార్టీ నాయకులు ససేమిరా అనడంతో సొంతపార్టీ నేతలే ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఇటీవల జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్‌ను కలిసి వెంటనే క్వారీలను నిలుపుదల చేయాలని కోరారు. ఈ విషయమై కలెక్టర్.. క్వారీల నిర్వహణపై స్థానిక అధికారులతో నివేదికలు తెప్పించి ప్రభుత్వానికి పంపించారు. 

అక్రమాలు నిజమని తేలడంతో..

ఇసుక క్వారీల యజమానులు అనుమతించినదాని కంటే ఎక్కువగా ఇసుక తరలించారని విచారణలో తేలడంతో కాంట్రాక్టర్ల్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. అలాగే వారి అగ్రిమెంట్లు, బ్యాంక్ గ్యారెంటీలను జప్తు చేసినట్లు టీజీ యండీసీ అధికారి రాంప్రసాద్ తెలిపారు. సహకరించిన ఐదుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. క్వారీలను సీజ్ చేయడంతో పాటు అగ్రిమెంట్లను కూడా రద్దు చేసినట్లు తెలిపారు.

నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మకై రద్దు డ్రామా ఆడుతు న్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్త టెండర్లు పిలిచి ఉమ్మడి జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మకై కొత్తగా నీటి ప్రవాహం తగ్గిన తరువాత క్వారీల ను ప్రారంభించేందుకు ఎత్తుగడలు వేస్తునారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఇసుక క్వారీలను రద్దు చేసినట్లు అధికారులు ‘విజయక్రాంతి’తో తెలిపారు.