calender_icon.png 28 September, 2024 | 12:44 PM

మానేరు రివర్‌ఫ్రంట్ పనులకు బ్రేక్

27-09-2024 12:07:08 AM

స్టే విధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 

కరీంనగర్, సెప్టెంబరు 26 (విజయక్రాంతి): కరీంనగర్ తలాపున రూ.410 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మానేరు రివర్‌ఫ్రంట్ పనులకు బ్రేక్ పడినట్లయింది. రివర్‌ఫ్రంట్ నిర్మాణాలు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. ఈ నెల 18న మరోసారి విచారించిన ఎన్‌జీటీ చెన్నై బెంచ్ కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అధికారులు నివేదిక ఇవ్వనందున డిసెంబర్ 2కు వాయిదా వేసింది. అయితే స్టే యథావిధిగా కొనసాగించనున్నారు. స్పష్టమైన ఆదేశాలు వెలువడే వరకు పనులు ఆపేయాలని ఆదేశించింది.

ఈ విషయం ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణానికి పర్యావరణ క్లియరెన్స్ లేదని హుస్నాబాద్‌కు చెందిన ఎం వెంకట్‌రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు విచారించిన ఎన్‌జీటీ సంబంధిత విభాగాల అధికారులకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎన్‌జీటీకి ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం రివర్‌ఫ్రంట్ పనులను నాలుగు జోన్లుగా విభజించాలని వంద కోట్లతో వ్యూయింగ్ గ్యాలరీ, ఎంట్రీ ప్లాజా, మ్యూజికల్ ఫౌంటెయిన్ అభివృద్ధి చేయాలని, బైపాస్ రోడ్ నుంచి బండ్ వరకు ఫార్మేషన్ రోడ్, ల్యాండ్‌స్కేపింగ్, పాత్‌వేల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

నాలుగు కోట్లు వెచ్చించి మట్టిని నింపాలని ప్రతిపాదించగా, ఈ పనులు జూన్ 2023 నుంచి నిలిచిపోయాయి. 60 కోట్లతో టూరిజం ద్వారా ఫౌంటెయిన్ నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభించామని, ప్రభుత్వ సంస్థలు సక్రమంగా డిజైన్లు రూపొందించకపోవడంతో 2023 జూన్ నుంచి పనులు నిలిపివేయాల్సి వచ్చిందని నివేదించింది. నీటి పారుదలశాఖ నుంచి అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నించామని, కానీ ఈ ప్రాజెక్టుకు ఎన్విరా న్‌మెంట్ క్లియరెన్స్ అవసరం లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదని నివేదికలో టీఎస్‌టీడీసీ పేర్కొంది.

ఈ సంవత్సరం మే 15న కేంద్ర పర్యావరణ అటవీ విభాగానికి చెందిన అధికారులు మానేరు రివర్‌ఫ్రంట్ అంశం గురించి తనిఖీలు కూడా చేశారు. అయితే పనులు జరగడం లేదని నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేసు విచారించిన ఎన్‌జీటీ పనులకు బ్రేక్ వేయడంతో నిధులు నీళ్లపాలు అయిన ట్లయింది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించింది. అప్పటి మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పట్టుబట్టి దీన్ని సాధించారు.