- 218 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 24,800పైన నిఫ్టీ ముగింపు
- బ్యాంకింగ్ షేర్లకు కొనుగోలు మద్దతు
ముంబై, అక్టోబర్ 18: కనిష్ఠస్థాయి వద్ద బ్యాంకింగ్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించడంతో మూడు రోజుల మార్కెట్ పతనానికి బ్రేక్‌పడింది. శుక్రవారం ఇంట్రాడేలో 884 పాయింట్ల వరకూపెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 81,391 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకిన అనంతరం చివరకు 218 పాయింట్ల లాభంతో 81,225 పాయింట్ల వద్ద నిలిచింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 104 పాయింట్లు లాభపడి కీలకమైన 24,800 పాయింట్ల ఎగువన 24, 854 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటంతో పాటు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్ల మద్దతు ఇవ్వడం మార్కెట్‌కు కలిసి వచ్చిందని ట్రేడర్లు చెప్పారు. ఆసియాలో జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు పెరిగాయి. యూరప్‌లో ప్రధాన మార్కెట్లయిన జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్‌లు పాజిటివ్‌గా ముగిసాయి.
యాక్సిస్ బ్యాంక్ టాపర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా యాక్సిస్ బ్యాంక్ 5.5 శాతంపెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కన్సాలి డేటెడ్ నికరలాభాన్ని 6 శాతం వరకూ పెంచుకోవడంతో ఈ షేరులో షార్ట్ కవరింగ్ జరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్ 3 శాతం వరకూ పెరిగాయి.
మరోవైపు క్యూ2 ఫలితాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చడంతో ఇన్ఫోసిస్ 4 శాతం పతనమయ్యింది. ఏషియన్ పెయింట్స్, నెస్లే, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హిందుస్థాన్ యూనీలీవర్, ఐటీసీలు 2 శాతం మేర నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా బ్యాంకెక్స్ 1.84 శాతం పెరిగింది.
మెటల్ ఇండెక్స్ 1.65 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.12 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 1.02 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 0.91 శాతం, ఆటోమొబైల్ ఇండెక్స్ 0.58 శాతం చొప్పున పెరిగాయి. ఐటీ సూచి 1.73 శాతం పడిపోయింది. టెక్నాలజీ ఇండెక్స్ 1.37 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.13 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.21 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ సూచి 0.16 శాతం తగ్గింది.
ఆగని ఎఫ్‌పీఐల అమ్మకాలు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) విక్రయాలు శుక్రవారం సైతం కొనసాగాయి. తాజాగా ఎఫ్‌పీఐలు రూ.5,485 కోట్ల విలువైన షేర్లు విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 13 ట్రే డింగ్ రోజుల్లో దాదాపు రూ.70,000 కోట్లకుపైగా ఈక్విటీ పెట్టుబడుల్ని విదేశీ ఫండ్స్ వెనక్కు తీసుకున్నాయి.