calender_icon.png 24 December, 2024 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుస నష్టాలకు బ్రేక్

24-12-2024 01:12:44 AM

* లాభాల్లో ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ లు సోమవారం  లాభాల్లో ముగిశాయి. గత వారం భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో నేడు లాభాల్లో కదలాడాయి. దీంతో ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అమెరికాలో ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెలువడడం ఆసియా సహా మన మార్కెట్లలోనూ సానుకూల వాతావరణానికి కారణమైంది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. 

సెన్సెక్స్ ఉదయం 78,488.64 పాయిం ట్ల వద్ద (క్రితం ముగింపు 78,041.59) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,918.12 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 498.58 పాయింట్ల లాభం తో 78,540.17 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 165.95 పాయింట్ల లాభంతో 23,753.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 13 పైసలు క్షీణించి 85.13 వద్ద జీవనకాల కనిష్ఠ స్థాయికి చేరింది.

సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, టెక్ మహీం ద్రా, హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. జొమాటో, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.96 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2640 డాలర్ల వద్ద కొనసాగతోంది.

ఫిబ్రవరి 1న పని చేయనున్నఎక్స్‌చేంజీలు

దేశీయ స్టాక్ ఎక్స్‌చేంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఫిబ్రవరి 1న కూడా యథాతథం గా పనిచేయనున్నాయి. బడ్జెట్ సందర్భంగా శనివారం కూడా ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు రెండు స్టాక్ ఎక్స్ఛేంజీలు సోమవారం ఓ సర్క్యులర్‌లో తెలిపాయి. ఉదయం 9 గంటల నుంచి 3.30 గంటల వరకు ఈక్విటీ ట్రేడింగ్, కమోడిటీ ట్రేడింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.