- ప్రపంచ నలుమూలలకు ప్రచారం
- ఎక్కడికెళ్లినా హైదరాబాద్ గురించి చెప్పండి
- ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
- త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేం
- ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
* తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్ 600 బిలియన్ డాలర్ల నగరంగా అభివృద్ధి చెందాలి. ఇందుకోసం ఐఎస్‌బీ విద్యార్థులు మాకు సాయంగా నిలబడాలి.
సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 20(విజయక్రాంతి): ‘తెలంగాణను ప్రపంచం నలు మూలలకు తీసుకెళ్లేందుకు ఐఎస్‌బీ విద్యార్థులు సాయపడాలి. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం’ అని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఐఎస్‌బీ విద్యార్థులను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా అభివర్ణించారు.
ఆదివారం గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో ‘లీడర్‌షిప్ ఇన్ న్యూ ఇండియా’ పేరుతో జరిగిన సమ్మిట్‌కు సీఎం ముఖ్య అతిథిగా హాజర య్యారు. పీజీ విద్యార్థుల కోసం ఐఎస్‌బీ ఏటా ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈసారి నిర్వహించిన సదస్సును సీఎం ప్రారంభించి మాట్లాడారు.
కాంగ్రెస్‌కు గొప్ప నాయకత్వ వారసత్వముందని.. మహాత్మాగాంధీ, నెహ్రూ, నర్దాల్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్ వంటి నాయకులు అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. గొప్ప నాయకులు కావాలంటే ధైర్యం చాలా ముఖ్యమని అన్నారు. కష్టపడే తత్వం, తెలివితేటలు, నైపుణ్యంతో పాటు కొన్నిసార్లు అదృష్టం కూడా ఉండాలని తెలిపారు.
గొప్ప నాయకులు కావాలనుకునేవారు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని, పోరాటంలో చాలా కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. దేశంలో గొప్ప నాయకులు ప్రజల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేశారని గుర్తుచేశారు. విద్యార్థులు చదవుతో పాటు రాజకీయాల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు.
ట్రిలియన్ డాలర్లకు పెంచుతాం
తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్ 600 బిలియన్ డాలర్ల నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పారు. ఇందుకోసం ఐఎస్‌బీ విద్యార్థులు తమకు సాయంగా నిలబడాలని కోరారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడాలని సూచించారు. హైదరాబాద్, భారత్‌లోని ఇతర నగరాలతో పోటీ పడాలని అనుకోవడం లేదని, న్యూయార్క్, పారిస్, టోక్యో వంటి సిటీలను ఆదర్శంగా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఒలింపిక్స్‌లో పథకమే లక్ష్యం
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. దానికి అనుసంధానమైన క్రీడా యూనివర్సిటీని గచ్చిబౌలిలోనే ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దక్షిణ కొరియా లాంటి చిన్న దేశం ఒలింపిక్స్‌లో పతకాలను సాధిస్తూ సత్తా చాటుతోందని, భారత్ ఒలింపిక్స్ పతకాలు సాధించడంలో వెనకపడిందని అన్నారు. ఒలింపిక్స్‌లో పథకాలు సాధించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. దేశానికి హైదరాబాద్‌ను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని తెలిపారు.
మాతో కలిసి పనిచేయండి
తమ సర్కారుతో కలిసి రెండుమూడేళ్లు పని చేయాలని ఐఎస్‌బీ విద్యార్థు లకు సీఎం సూచించారు. ఈ పనిచేసే సమయంలో తమ ప్రభుత్వం భారీగా వేతనాలు ఇవ్వకపోయినా.. గట్టి సవాళ్లను ఇస్తామని పేర్కొన్నారు. ఐఎస్‌బీ లో చదువుతున్న వారంతా చాలా తెలివైన వారని కొనియాడారు.
అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి ఐఎస్‌బీ ప్రాంగణంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల, ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి (రిటైర్డ్), మాజీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ డాక్టర్ షమిక రవి, ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సురేష్ నారాయణన్ తదిదరులు పాల్గొన్నారు.