calender_icon.png 3 March, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదడు తినేస్తున్న రీల్స్..

02-03-2025 12:00:00 AM

రోజంతా రీల్స్ చూడటం.. చూసిన వాటిని తిరిగి షేర్ చేయడం అనేది నయా ట్రెండ్. అదే పనిగా రీల్స్, షార్ట్స్ చూడటం వల్ల డిజిటల్ బానిసలుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీరు మరోలా ఉంటుంది. సోషల్ మీడియా అడిక్షన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం.. 

తింటున్నా, బాత్రూంలో ఉన్నా సిరీస్‌ను మొదలుపెడితే ముగించేదాకా ఆపరు. యూట్యూబ్ చూసేవారన్నా కాసేపు చూడటానికి, వినడానికి సమయాన్ని కేటాయిస్తారేమో.. కానీ షార్ట్స్, రీల్స్‌కు అలవాటు పడినవారు మాత్రం విరామం లేకుండా పైకి స్క్రోల్ చేస్తూనే ఉంటారు. టీవీ సిరీస్‌లు, రీల్స్ వంటివి యూత్‌లోనే కాదు.. పెద్దవారిలోనూ కొత్త రకమైన అడిక్షన్‌ను కలిగిస్తున్నాయి. తెలిస్తే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో కూడా చెప్పలేనంత ఆందోళన కలిగిస్తున్నాయి. 

డిజిటల్ బానిసలు..

నిరంతరం స్క్రోలింగ్‌కు అలవాటుపడిన వారు రోజులో ఎన్నో గంటలు వృథా చేస్తుంటారు. ఈ సమస్య ఒక్క సమయానికే కాదు.. వారి భవిష్యత్తుది కూడా. ఇలా గంటల తరబడి చూడటం వల్ల ఏకాగ్రత పూర్తిగా తగ్గిపోతుంది. ఏ విషయాన్ని లోతుగా ఆలోచించలేరు. ఎవరితోనూ కనెక్ట్ కాలేరు. 

ఇన్ స్టా రీల్స్‌తో ప్రమాదం..

సోషల్ మీడియాలో అత్యంత ప్రమాదకరమైనది ఇన్ స్టా గ్రామ్ రీల్స్. ఇన్ స్టా రీల్స్ చూసేవారిని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. సెకన్ల వ్యవధిలో ఒక్క స్వైప్‌తో మారే కంటెంట్.. మైండ్‌ను ఒక్కసారిగా ప్రేరేపించే మ్యూజిక్ బైట్స్.. ఇవన్నీ బుర్రలో డోపమైన్‌ను విడుదల చేస్తాయి. ఎదుటివారు మాట్లాడుతున్నా తలకెక్కదు. పక్కనేం జరుగుతున్న పట్టదు. అలాంటి కంటెంటే ఇంకా ఇంకా చూడాలి అని మనసు మొండికేస్తుంది. ఈ లక్షణాలన్నీ డిజిటల్ ట్రాప్‌లో పడ్డారని తెలిపే బలమైన సంకేతాలు. 

ఒంటరితనం..

సోషల్ మీడియా అడిక్షన్ వల్ల దేనిపై శ్రద్ధ పెట్టలేరు. నెమ్మదిగా చేయాల్సిన పనులు, ఓర్పుతో చేయాల్సిన టాస్కుల్లో పర్ఫార్మెన్స్ జీరో అవుతుంది. అన్నింటికన్న పెద్ద రిస్క్ ఏమిటంటే.. ఇన్ని రకాలుగా ఫోన్‌తో బిజీగా ఉంటున్నప్పటికీ మనసులో ఏదో తెలియని వెలితి మొదలవుతుంది. అది మెల్లగా పెరిగిపోయి ఒంటరితనమే తోడవుతుంది. బయటి ప్రపంచంతో పూర్తిగా డిస్ కనెక్ట్ అవుతారు. ఈ అలవాటు మెంటల్ హెల్త్‌ను పూర్తిగా దెబ్బతీసేస్తుంది. 

ట్రాప్‌లో పడకుండా.. 

డిజిటల్ ట్రాప్‌లో పడితే మర మనుసుల్లా మారిపోతారు. ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. ఎదుటివారు చెప్పేది వినేంత సహనం ఉండదు. ఆలోచనలు, భావోద్వేగాల మీద పట్టు కోల్పోతారు. ఆఖరికి మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఒకవేళ ఇప్పటికి డిజిటల్ ట్రాప్‌లో ఇరుక్కుని ఉంటే మెడిటేషన్ మాత్రమే మిమ్మల్ని కాపాడగలదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ధ్యానం మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.