25-02-2025 12:00:00 AM
మేడ్చల్, ఫిబ్రవరి 24(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పూజా కార్యక్రమాలకు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డికి ఆలయ కమిటీ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈవో కట్ట సుధాకర్ రెడ్డి వేద పండితులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయం పక్కన ఏర్పాటు చేసిన యాగశాలను ఆలయ కమిటీ చైర్మన్ ప్రారంభించారు. మార్చి 1వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి.
మహాశివరాత్రి, ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఏర్పాట్లను, ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు.