రాంబాబు దర్శకత్వంలో ఆమని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బ్రహ్మాండ’. మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో దాసరి సురేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే నిర్మాత దాసరి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. “ స్క్రిప్ట్ దశలో మేము అనుకున్నది అనుకున్నట్టుగా .. అంతకుమించి మా దర్శకుడు రాంబా బు చిత్రీకరించారు.
ఇప్పటి వరకూ ఎవరు చూడని చత్తీస్‌ఘడ్, కర్ణాటక లొకేషన్‌లలో సినిమాను చిత్రీకరించాం. ముఖ్యం గా ఆమని, బలగం జయరాం సహకారం మరవలేము” అని చెప్పారు. చిత్ర దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ.. “తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వారి సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న చిత్రం ఇది. ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం.
ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఈ చిత్ర కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను తప్పకుండా రంజింప చేస్తుంది. డివోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి” అన్నారు.