12-02-2025 08:03:16 PM
మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడి వంటి దర్శకులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
బ్రహ్మానందంకి పాత్ర ఇచ్చి చాలా ఏడ్పించాడు
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘సినిమాను తీయడం ఎంత ముఖ్యం.. మంచి టైంకి రిలీజ్ చేయడం, ప్రమోట్ చేయడం చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను చక్కగా ప్రమోట్ చేశాడు. రాజా రవీంద్ర ఈ బ్రహ్మా ఆనందం సినిమా గురించి చెప్పాడు. హీరోలు దొరకడం లేదు.. ప్రమోషన్స్ కాస్త డల్‌గా ఉన్నాయ్ అని చెప్పాడు. నేను వస్తాను అని వెంటనే బ్రహ్మానందంకు ఫోన్ చేసి చెప్పాను. ప్రతీ దానికి, ప్రతీ చోటా చిరంజీవి కనిపిస్తున్నాడని అంతా అనుకున్నా సరే. నాకున్న ఇమేజ్, గుడ్ విల్ వాడి ఇతర సినిమాల్ని ప్రమోట్ చేస్తాను. నా మిత్రుడు బ్రహ్మానందం గురించి అయితే నేను కచ్చితంగా వస్తాను. చంటబ్బాయ్ పాట షూటింగలో నేను బిజీగా ఉన్నప్పుడు.. ఓ వ్యక్తి విజిల్స్ వేస్తూ నానా హంగామా చేశాడు. అత్తిలి లెక్చరర్ అండి అని జంధ్యాల గారు చెప్పారు. వెంటనే అతడ్ని పిలిచి మాట్లాడాను. మిమిక్రీ కూడా చేస్తాడని తెలిసి సాయంత్రం రమ్మని అన్నాను. అలా ప్రతీ రోజూ సాయంత్రం వచ్చేవాడు.
రన్నింగ్ కారెక్టర్ అని జంధ్యాల గారు బ్రహ్మానందంకి పాత్ర ఇచ్చి చాలా ఏడ్పించాడు. అలా మా స్నేహం మొదలైంది. ఇంత టాలెంట్ ఉన్న ఈ వ్యక్తి ఇక్కడే ఉండిపోకూడదని అనుకున్నాను. మద్రాస్‌కు తీసుకెళ్తే ఈ టాలెంట్‌ను అందరూ వాడుకుంటారు అని అనుకున్నాను. బ్రహ్మానందంను ఇంటికి తీసుకెళ్తే నా తమ్ముళ్లు వింతగా చూశారు. నాతో పాటు బ్రహ్మానందంను ప్రతీ చోటకు తీసుకెళ్లేవాడ్ని. బ్రహ్మానందుకు నేను అంబాసిడర్, ఏజెంట్‌ను అయి ప్రమోట్ చేశాను. అలా మొదలైన బ్రహ్మానందం ప్రయాణం నేటికి ఏ స్థాయికి వెళ్లిందో అందరికీ తెలిసిందే. బ్రహ్మానందం తన కొడుకుతో కలిసి చేసిన ఈ బ్రహ్మా ఆనందం మూవీని అందరూ ఆదరించాలి. ఈ మూవీని తీసిన నిఖిల్, నిర్మాత రాహుల్‌కు ఆల్ ది బెస్ట్. రఘు బాబు, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల వంటి వారు నటించడంతో పరిపూర్ణత చేకూరినట్టు అయింది. ప్రియ, ఐశ్వర్య, దివిజలకు ఆల్ ది బెస్ట్. ఇలాంటి చిత్రాలను ఆదరించండి. ఇలాంటి వేడుకకు నన్ను పిలిచిన నా సోల్ మేట్ బ్రహ్మానందంకు థాంక్స్. ఫిబ్రవరి 14న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. నీకు (బ్రహ్మానందం) పుత్రోత్సాహం కలుగుతుంది. నేను ఎలాగైతే పుత్రోత్సాహాన్ని పొందుతున్నానో.. నువ్వు (బ్రహ్మానందం) కూడా అంతే పుత్రోత్సాహాన్ని పొందుతావు’ అని అన్నారు.
ఖైదీ చూసి షాక్ అయ్యాను..
బ్రహ్మానందం మాట్లాడుతూ .. ‘నిర్మాత రాహుల్‌కు ఎంతో ప్యాషన్ ఉంది. సినిమాను ఎలా తీయాలా? అని నిత్యం ఆలోచిస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తులతో పని చేయడం నాకు గర్వంగా అనిపిస్తోంది. డైరెక్టర్ నిఖిల్ ప్రారంభంలో నన్ను, రఘుబాబు, రాజీవ్ కనకాల వంటి వాళ్లను చూసి కాస్త తడబడేవాడు. బేవర్స్ తాత, ఎడమెంట్ మనవడు కలిసి చేసే ప్రయాణమే ఈ మూవీ. ఈ కథను నిఖిల్ ఎంతో అద్భుతంగా రాసుకున్నాడు. అంతే అద్భుతంగా తీశాడు. ప్రేమ అనేది అనంతం. వెన్నెల కిషోర్ వద్దకు కథ వెళ్తే.. హీరోగా కాకుండా సైడ్ ఆర్టిస్ట్ పాత్రను ఎంచుకున్నాడు. వెన్నెల కిషోర్ వల్లే రాజా గౌతమ్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాడు. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు పిల్లర్స్‌లా నిలబడ్డారు. ఒక ఈవీవీ గారిని, ఒక ఎస్వీ కృష్ణారెడ్డి గారిని, ఒక రేలంగి గారిని మిక్సిలో వేస్తే అనిల్ రావిపూడి వస్తాడు. కామెడీ పవర్ ఏంటో చూపించిన దర్శకుడు అనిల్ రావిపూడి. నాగ్ అశ్విన్ అందరికీ ఆదర్శప్రాయుడు.
కల్కి లాంటి సినిమాను తీసి కూడా ఎంతో ఒదిగి ఉంటాడు. అసలు మనుషులు ఎలా ఉండాలో నాగ్ అశ్విన్ నుంచి తెలుసుకోవాలి. చిరంజీవి గారి గురించి మాట్లాడే అర్హత నాకు మాత్రమే ఉంది. నాలుగు దశాబ్దాలుగా పరిచయం ఉంది. ఖైదీ సినిమాను చూసి షాక్ అయ్యాను. ఆయన ట్రెండ్ సెట్టర్. ఘరానా మొగుడు వంద రోజుల ఫంక్షన్ గుంటూరులో జరిగింది. ఇసుక పోస్తే రాలనంత జనం వచ్చారు. అదీ ఆయన రేంజ్. బెజవాడ నుంచి గుంటూరు వరకు మేం వెళ్తుంటే.. మాతో పాటు ర్యాలీగా వచ్చారు. అదీ ఆయన స్థాయి. ఆయన కాలు కదిపితే రాష్ట్రం మొత్తం షేక్ అయ్యేది. డ్యాన్స్, ఫైట్స్ అంటే కేవలం చిరంజీవి గారే గుర్తుకు వచ్చేవారు.
ఆ తరువాత మా పొట్ట కొడతాడేమో అని అనుకున్నా. కామెడీ కూడా అద్భుతంగా పండించేవారు. ఆయన చూడని చరిత్రా.. తెలియని చరిత్రా.. ఆయన కింగ్ ఆఫ్ వరల్డ్ ఫిల్మ్. రగులుతోంది మొగలిపొద సాంగ్‌ను చూస్తే ఆయన బాడీ స్ప్రింగులా అనిపిస్తుంది. కొరియోగ్రాఫర్లు సైతం కొత్తగా ఏం చేయించాలా? అని కంగారు పడేవారు. చిరంజీవి గారిని పదే పదే పిలుస్తున్నాను కదా.. బాగుంటుందా? లేదా? అని అనుకున్నాను. రాజా రవీంద్రతో అదే మాట అన్నాను. ఆ మాట చిరంజీవి గారికి చెప్పాడు. వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఏరా.. నన్ను పిలవడానికి వెనుకాముందు ఆడుతున్నావ్ అని అన్నారు. రాజా గౌతమ్ నాకూ బిడ్డ లాంటివాడే.. టైం, డేట్ చెప్పు.. నేను వస్తాను అని అన్నారు. ఆయన నిజంగానే భోళా శంకరుడు. హద్దులు లేనటువంటి వారే చిరంజీవి. నన్ను చేయి పట్టుకుని విమానం ఎక్కించుకుని తీసుకొచ్చారు. ఇప్పుడు నా బిడ్డని ఈ విమానం ఎక్కిస్తున్నారు. ఈ మూవీని చూశాను. చాలా అద్భతుంగా ఉంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం రాబోతోంది’ అని అన్నారు.
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ .. ‘బ్రహ్మా ఆనందం సినిమాకు గెస్టుగా రావడం గౌరవంగా భావిస్తున్నాను. చిరంజీవి గారు, బ్రహ్మానందం గార్లతో స్టేజ్‌ను పంచుకోవడం ఆనందంగా ఉంది. బ్రహ్మానందం గారితో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. చిరంజీవి గారితోనూ పని చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. రాజా గౌతమ్‌లో చాలా ప్యాషన్ ఉంటుంది. అతనికి ఇంకా రావాల్సిన సక్సెస్, గుర్తింపు రాలేదు. ఈ బ్రహ్మా ఆనందం పెద్ద హిట్ అవుతుంది. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘నిర్మాత రాహుల్ గారు వరుసగా సక్సెస్‌లు సాధిస్తున్నారు. మంచి అభిరుచి ఉన్న నిర్మాత. రాహుల్ గారికి ఆల్ ది బెస్ట్. ఎంత ఎదిగినా, పెరిగినా ఎంతో ఒదిగి ఉంటాడు. ఈ చిత్రంలో నటించిన, పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. రాజా గౌతమ్ తనని తాను సొంతంగా ఫ్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఈ మూవీతో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. కొడుకు సక్సెస్‌తో బ్రహ్మానందం గారి మనసు నిండిపోవాలని అనిపించింది. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
రాజా గౌతమ్ మాట్లాడుతూ ..‘మా కోసం వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారు, నాగ్ అశ్విన్ గారికి థాంక్స్. నాకు చిన్నప్పటి నుంచి హీరో అంటే తెలిసింది చిరంజీవి గారు. ఇంద్రలో వేసిన చిరంజీవి గారు వేసిన స్టెప్‌ని నాన్న ముందుగానే చూశారు. ఇంట్లో మా నాన్న గారు వర్షంలో ఆ స్టెప్పులు వేస్తున్నారు. చిరంజీవి గారు అద్భుతంగా చేశారు అంటూ మా నాన్న గారు ఎంతో ఎగ్జయిటింగ్‌గా చెప్పారు. అన్ని వర్గాల వారిని, వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఫిబ్రవరి 14న మా చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
వెన్నెల కిషోర్ మాట్లాడుతూ .. ‘మా సినిమా ఈవెంట్ కోసం వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్. బ్రహ్మా ఆనందం సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రియ, ఐశ్వర్య, దివిజ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. రాజా గౌతమ్ నాకు వారెవ్వా సినిమాతో పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి స్నేహితులుగా మారిపోయాం. బ్రహ్మానందం గురించి చెప్పే స్థాయి నాకు లేదు. ఇందులో రాజీవ్ కనకాల గారు చివరి వరకు ఉంటారు. దాన్ని బట్టి ఈ సినిమాలో ఎలాంటి వయలెన్స్ ఉండదని అర్థం చేసుకోవచ్చు’ అని అన్నారు.
దర్శకుడు నిఖిల్ మాట్లాడుతూ .. ‘బ్రహ్మా ఆనందం ఈవెంట్‌కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్. ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ టైంలో ఫస్ట్ టైం నాకు ట్రాఫిక్ జాం, తొక్కిసలాట అనేవి నాకు తెలిశాయి. చిరంజీవి గారి వల్లే తెలుగు సినిమా పైస్థాయికి వచ్చింది. బ్రహ్మానందం లాంటి గొప్ప నటుడితో నేను సినిమాను చేశాను. ఆయన లేకపోతే ఈ సినిమాను చేసేవాడ్ని కాదు. ఈ మూవీ ఇంత వరకు వచ్చేది కూడా కాదు. వెన్నెల కిషోర్ గారు, రాజీవ్ కనకాల గారు, సంపత్ గారు, రఘు బాబు గారు అద్భుతంగా నటించారు. రాజా గౌతమ్ గారు ఎక్స్‌ట్రీమ్ లెవెల్లో నటించారు. రాహుల్ గారు నాకు ఈ ప్రయాణంలో ఎప్పుడూ అండగా నిలబడ్డారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. ‘మెగాస్టార్ చిరంజీవి గారిని ఇంత దగ్గరి నుంచి చూస్తానని అనుకోలేదు. మా కోసం వచ్చిన నాగ్ అశ్విన్ గారు, అనిల్ రావిపూడి గారికి థాంక్స్. ఈ కథను బ్రహ్మానందం గారు ఓకే చెబితేనే చేద్దామని అనుకున్నాను. ఆయనకు కథను చెప్పాం. ఓకే అన్నారు. బ్రహ్మా ఆనందం అనే టైటిల్‌తో బ్రహ్మానందం గారితో సినిమా అనేది చాలా పెద్ద బాధ్యత అనిపించింది. రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. నిఖిల్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. బ్రహ్మానందం కోసం థియేటర్‌కు వస్తారు.. కానీ రాజా గౌతమ్‌ను ఇంటికి తీసుకెళ్తారు’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శాండిల్య మాట్లాడుతూ.. ‘బ్రహ్మా ఆనందం వంటి సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన రాహుల్ గారికి థాంక్స్. నాం టీం వల్లే మంచి అవుట్ పుట్ వచ్చింది. అమ్మ, అమ్మమ్మ సపోర్ట్ వల్లే ఈ స్థాయికి వచ్చాను’ అని అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి ప్రియం మాట్లాడుతూ.. ‘స్వధర్మ్ నాకు హోం బ్యానర్ లాంటిది. బ్రహ్మా ఆనందం చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన రాహుల్ గారికి థాంక్స్’ అని అన్నారు. ప్రియా వడ్లమాని మాట్లాడుతూ.. ‘మెగాస్టార్ చిరంజీవి గారిని ఇలా చూస్తుండటం ఆనందంగా ఉంది. బ్రహ్మానందం గారితో వీరాంజనేయులు విహారయాత్రను చేశాను. మళ్లీ ఆయనతో నటించడం ఆనందంగా ఉంది. నాకు తార లాంటి మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. గౌతమ్ గారికి ఇది గొప్ప ఆరంభం అవుతుంది. వెన్నెల కిషోర్ గారి రూపంలో నాకు మంచి స్నేహితుడు దొరికారు. దివిజ, ఐశ్వర్యలతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఫిబ్రవరి 14న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘మా కోసం వచ్చిన చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారు, నాగ్ అశ్విన్ గార్లకు థాంక్స్. ఈ రోజు ఇలా స్టేజ్ మీద ఉన్నందుకు ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఫిబ్రవరి 14న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు. దివిజ మాట్లాడుతూ.. ‘మెగాస్టార్ చిరంజీవి గారు మా కోసం రావడం ఆనందంగా ఉంది. మాకు సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి గారు, నాగ్ అశ్విన్ గార్లకు థాంక్స్. బ్రహ్మానందం గారి లాంటి పెద్ద ఆర్టిస్ట్ నాకు ఎంతో కంఫర్ట్ ఇచ్చారు. కిషోర్ సర్ టైమింగ్‌ను పట్టుకోవడం కష్టం. గౌతమ్ గారికి ఇది కం బ్యాక్ అవుతుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.