కొల్చారం: తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ మానసిక వేదనతో సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొల్చారం మండల కేంద్రంలో శనివారం జరిగింది. ఏఎస్ఐ తారాసింగ్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన లంబాడి రవీందర్ (27) కొల్చారం పోస్ట్ ఆఫీస్ లో బిపిఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేసినా ఆరోగ్యం మెరుగు పడలేదు. శుక్రవారం ఉదయం కడుపులో నొప్పి వస్తుందని చెప్పి భరించలేక తన ఇంట్లో పురుగుల మందు తాగిన విషయాన్ని తన భార్య సంకుతో తెలుపగా ఆమె, కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తము 108 వాహనంలో మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి రెండు సంవత్సరాల కూతురు ఉంది. మృతుని భార్య సంకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తారాసింగ్ తెలిపారు.