17-04-2025 01:45:56 AM
ఫీజు రియెంబర్స్‌మెంట్ విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యం డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో గురువారం నుంచి జరిగే డిగ్రీ పరీక్షలను మళ్లీ బహిష్కరిస్తున్నామని, ఫీజు రియెంబర్స్‌మెంట్ విడుదలయ్యే వరకు పరీక్షలు కొనసాగించలేమని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ, పీజీ అప్లియేటెడ్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొజ్జ సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బొజ్జ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలు కేవలం ప్రభుత్వం చెల్లించే రియెంబర్స్‌మెంట్ మీదే ఆధారపడి ఉండటం, వేరే ఇతర ఫీజులు లేకపోవడం, మూడేండ్లుగా ప్రభుత్వం రియెంబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలలు నడిపేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పులు చేసి కాలేజీలు నిర్వహిస్తుండటంతో.. తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆర్థికంగా కుదేలవుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఉపముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందన్నారు. స్వయంగా రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కూడా మా పరిస్థితిని గమనించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేసినా అవీ విఫలమయ్యాయన్నారు.
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఫైనాన్స్ సెక్రటరీ దరిపల్లి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ పరిస్థితుల్లో యాజమాన్యాలందరూ ఆర్థికకపరమైన ఇబ్బందులతో వ్యవస్థలను నడపలేని స్థితిలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని తమను ఆదుకోవాలని కోరారు. స్టేట్ జనరల్ సెక్రటరీ యాద రామకృష్ణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మారం నాగేందర్‌రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఫైనాన్స్ సెక్రటరీ దరిపల్లి ప్రవీణ్ కుమార్, సెక్రటరీ మైలారిశెట్టి సైదారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ హనుమంతు యాదవ్, స్టేట్ ఈసీ మెంబర్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.