calender_icon.png 4 October, 2024 | 4:53 PM

ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి

04-10-2024 01:44:15 PM

గ్రామాల్లో వీధికుక్కల బెడద... అధికారుల చర్యలు శూన్యం 

అలంపూర్: ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన అలంపూర్ పరిధిలోని మానవపాడు మండలం అమరవాయి గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఘటనకు సంబంధించిన స్థానికులు కుటుంబ సభ్యులు, తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బోయ పరుశరాముడు శిరీష దంపతుల కొడుకు రేవంత్ 6 ఉదయం ఇంటి ముందు ఆడుకున్నాడు.

కిరాణం షాపుకు వెళ్లి పాలప్యాకెట్ తీసుకురామని తల్లి శిరీష చెప్పగా.. ఈ క్రమంలో వెళ్తున్న రేవంత్ పై వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చేతులు, తలపై తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడికి బాలుడు అరుపులు, కేకలు  వేయగా తల్లిదండ్రులు స్థానికులు హుటాహుటిన చేరుకుని కుక్కలను తరిమికొట్టారు. గాయపడిన బాలుడిని మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వీధికుక్కలను కట్టడి చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో వీధికుక్కల బెడద ఎక్కువైంది. వీధుల్లో గుంపులు గుంపులుగా రోడ్డుపై తిరుగుతూ  ఆ దారి గుండా వెళ్లే వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.