- యాదాద్రి ఆలయ క్యూలో ఘటన
- చాకచక్యంగా బయటకు తీసిన భక్తులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
నల్లగొండ (యాదాద్రి భువనగిరి), డిసెంబర్ 29 (విజయక్రాంతి): బడి, గుడి.. ఆ చోటు.. ఈ చోటనే తేడా లేకుండా చిన్నారుల చేసే అల్లరి చేష్టలు ఒక్కోసారి తల్లిదండ్రులకు తీవ్ర తలనొప్పి తెచ్చిపెడతాయి. యాదాద్రి ఆలయంలో ఐదేండ్ల చిచ్చరపిడుగు ఆటతీరు ఆదివారం అతడి తల్లిదండ్రులను, భక్తులను ఆందోళకు గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బోడుప్పల్‌కి చెందిన ఓ కుటుంబం ఆదివారం లక్ష్మీనరసింహస్వామి దర్శనార్ధం యాదగిరిగుట్ట వెళ్లారు. దర్శనానికి వెళ్లేందుకు రూ.150 టికెట్ తీసుకొని క్యూలో నిలబడగా వారితో వచ్చిన బాలుడు క్యూలైన్ గ్రిల్స్ పట్టుకొని ఆడుకుంటూ మధ్యలో తలపెట్టడంతో రెండు ఇనుప కడ్డీల మధ్య అతడి తల ఇరుక్కుపోయింది.
దీంతో బోరుమంటూ విలవిలలాడాడు. తల్లిదండ్రులు, భక్తులు బాలుడి తలను కొంచెం అటు ఇటు జరిపి అతికష్టం మీద కాసేపటి తర్వాత బయటకు తీశారు. అయితే చిన్నారికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున్నవారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.