- ఖమ్మం అంకుర ఆసుపత్రిలో ఘటన
- ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన
ఖమ్మం, జనవరి 20 (విజయక్రాంతి): ఖమ్మంలోని అంకుర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలుడు ఆకస్మికంగా మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్చర్లకు చెందిన ప్రణవ్‌తేజ్(4) ఆదివారం గ్రామంలోని ఇంటి వద్ద ఎడ్లబండి పైనుంచి కింద పడటంతో గాయాలయ్యాయి.
కుటుంబ సభ్యులు ఖమ్మంలోని అంకుర ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ప్రణవ్‌తేజ్ సోమవారం గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఆసుపత్రి ఎదుట మృలదేహంతో ఆందోళనకు దిగారు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఆరోగ్యంగా ఉన్న బాలుడికి గుండెపోటు రావడం ఏమిటని యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయాడని, న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. బాధితులు ఆస్పత్రి అద్దాలు పగులగొట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి, ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.