calender_icon.png 26 November, 2024 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొంతులో పూరీ ఇరుక్కొని బాలుడి మృతి

26-11-2024 12:00:00 AM

సికింద్రాబాద్‌లో విషాదం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. గొంతులో పూరీ ఇరుక్కొని 6వ తరగతి విద్యార్థి విరేన్ జైన్(11) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయగూడలో నివాసముండే గౌతమ్ జైన్ కుమారుడు విరేన్ జైన్ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ సమీపంలో గల అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు.

రోజు మాదిరిగానే సోమవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన వీరేన్.. స్కూల్‌లో లంచ్ సమయంలో భోజనం చేస్తుండగా ఒకేసారి మూడు కంటే ఎక్కువ పూరీలు తినడంతో అవి గొంతులో ఇరుక్కొని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. గమనించిన టీచర్లు వెంటనే విరేన్ జైన్ తల్లిదండ్రులకు సమాచారం అందించి హుటాహుటిన స్థానిక గీతా నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లారు.

అయితే పరిస్థితి విషమించడంతో అపోలో హాస్పిటల్స్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. అపోలోకు చేరుకున్న తర్వాత విరేన్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు.

బాలుడి తండ్రి గౌతమ్ జైన్ ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.