calender_icon.png 16 November, 2024 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

19 ఏళ్ల తర్వాత రింగ్‌లోకి బాక్సింగ్ దిగ్గజం

16-11-2024 02:40:54 AM

జేక్ పాల్‌తో మైక్ టైసన్ అమీతుమీ

అర్లింగ్‌టన్ (టెక్సస్): బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ పరిచయం అక్కర్లేని పేరు. 58 ఏళ్ల వయసులోనూ తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను చిత్తు చేయగల సామర్థ్యం అతని సొంతం. 2005 నుంచి ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు దూరమైన మైక్ టైసన్ తాజాగా 19 ఏళ్ల తర్వాత మళ్లీ రింగ్‌లో అడుగుపెట్టనున్నాడు.

యూట్యూబర్ నుంచి బాక్సర్‌గా మారిన 27 ఏళ్ల జేక్ పాల్‌తో మైక్ టైసన్ అమీతుమీకి సిద్ధమయ్యాడు. ఎన్‌ఎఫ్‌ఎల్ డల్లాస్ కౌబాయ్స్ వేదికగా జరగనున్న మ్యాచ్‌ను దాదాపు 60వేల మందికి పైగా వీక్షించనున్నారు. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో మ్యాచ్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రసారం చేయనుంది. కాగా మ్యాచ్‌కు ముందు బరువును కొలవడం ఆనవాయితీ.

ఈ సమయంలో ప్రత్యర్థులను ఫేస్ ఆఫ్‌కు పిలుస్తారు. ఈ సమయంలో మైక్ టైసన్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా జేక్ పాల్ చెంపపై కొట్టడం వైరల్‌గా మారింది. ‘మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఇక అంతా రింగ్‌లోనే’ అని టైసన్ సమాధానమిచ్చాడు. 1985లో ప్రొఫెషనల్ బాక్సర్‌గా కెరీర్ ఆరంభించిన మైక్ టైసన్ తాను పాల్గొన్న 58 బౌట్స్‌లో 50 విజయాలు, ఆరు ఓటములు చవిచూశాడు.

ఇందులో 44 నాకౌట్ ద్వారా ఫలితం రాగా.. తొలి 19 ప్రొఫెషనల్ ఫైట్స్‌ను వరుసగా నాకౌట్‌లో గెలవడం ఇప్పటికీ రికార్డుగా ఉంది. 2005లో రిటైర్మెంట్ ప్రకటించిన మైక్ టైసన్ 1992లో రేప్ కేసులో దోషిగా తేలి ఆరేళ్ల పాటు జైలు జీవితం కూడా గడిపి వచ్చాడు. 27 ఏళ్ల జేక్ పాల్ ప్రొఫెషన్ బాక్సింగ్ కెరీర్‌లో 11 సార్లు తలపడగా అతడి రికార్డు 10-1గా ఉంది. ఇందులో ఏడు నాకౌట్ విజయాలున్నాయి.