calender_icon.png 29 September, 2024 | 11:30 PM

సీసా బ్రాండెడ్.. లిక్కర్ లోకల్!

29-09-2024 02:03:39 AM

హైదరాబాద్ కేంద్రంగా మద్యం దందా

తక్కువ ధరకు ‘ఆర్మీ’ సరుకని బురిడీ

పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి సుంకం చెల్లించని మద్యం

ప్రత్యేక దృష్టిసారించిన ఎక్సైజ్‌శాఖ

ముమ్మర దాడులు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. వీకెండ్ వచ్చిందంటే చాలు మెజార్టీ ఇక్కడి యువత పార్టీ మూడ్‌లో ఉంటారు. వేలల్లో జీతం తీసుకునే సాధారణ ఉద్యోగి నుంచి లక్షల్లో జీతం తీసుకునే ఐటీ ఉద్యోగుల వరకు దావతుల్లో మునిగి తేలుతుంటారు.

వీరిని టార్గెట్ చేస్తూ కొందరు అక్రమార్కులు కాస్ట్లీ సీసాల్లో చీప్‌లిక్కర్ నింపి అంటగడుతున్నారు. విదేశీ మద్యం, ఆర్మీ మద్యమని నమ్మబలికి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా కొందరు ఎక్సైజ్ సిబ్బందికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నారు.  తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ మీదుగా ఎక్సైజ్ సుంకం చెల్లించని మద్యాన్ని కూడా మరికొందరు నగరానికి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల అనేక ఘటనలు

కర్ణాటకలోని బీదర్‌కు చెందిన అక్రమార్కులు ఆర్మీ మద్యం బాటిళ్లను సేకరించి, వాటిలో చీప్ లిక్కర్ నింపుతున్నారు. అలా నింపిన మద్యం సీసాలను హైదరాబాద్‌లో మద్యం ప్రియులకు తక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మెదక్, సంగారెడ్డి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తున్న 258.4 లీటర్ల నాసిరకం మద్యాన్ని పట్టుకుని ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

గోవా నుంచి కొందరు తీసుకొస్తున్న రూ.12 లక్షల విలువ చేసే 415 మద్యం సీసాలను శంషాబాద్ విమానాశ్రయంలో చెకింగ్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఏడాది సికింద్రాబాద్‌లో 452 లీటర్ల సుంకం చెల్లించని మద్యాన్ని పట్టుకుని 13 మందిని అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో రూ.24.54 లక్షల విలువ గల  2,143 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 254 మందిపై 238 కేసులు నమోదు చేశారు. 

ఎక్సైజ్ సుంకం చెల్లించకుండా

తక్కువ ధరకే కాస్లీ మద్యం అంటూ అక్రమార్కులు మద్యం ప్రియులను మోసం చేస్తున్నారు. పండుగ సమయం కాబట్టి కొందరు వెంటనే అక్రమార్కులు నమ్మి నకిలీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వారికి వారే జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. కొందరు గోవా, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో తక్కువ ధరకు మద్యం కొని, ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. కాగా, సుంకం చెల్లించని మద్యంపై ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ఇటీవల దాడులు నిర్వహించి భారీగా నకిలీ మద్యాన్ని పట్టుకున్నది. 

చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాం

ఎక్సైజ్ సుంకం చెల్లించని మద్యం రాకుండా చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్టీఎఫ్, టీటీఎఫ్ టీమ్‌లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తు న్నాం. సుంకం చెల్లించని మద్యాన్ని ఎవరూ కొనొద్దు. అలాంటి మద్యం అమ్మినా, కావాలని ఎవరైనా అడిగినా ఎక్సైజ్ శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 2523 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. 

 వీబీ కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్