ఐ.వి.మురళీకృష్ణ శర్మ :
‘తగలబడిన తన ఇంటిని చక్కదిద్దుకోకుండా పక్కవారి ఇల్లు ఎలా తగలబడిందా’ అని విచారించే వివేకి చందంగా ఉంది బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు. తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా తిరస్కరణకు గురైన ఆ పార్టీ తమ వైఫల్యాలను విశ్లేషించుకొని చక్కదిద్దుకోవాల్సి ఉంది. దానికి బదులు ‘పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్సీపీ ఎలా ఓడిపోయింది?’ అని బాధ పడుతున్నట్టు ఉంది ఆయన వ్యవహారం. ఈ రెండు పార్టీలు ఒకే రకమైన తప్పులు చేసి ఒకే రకమైన ఫలితాలు పొందాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఒంటెత్తు పోకడలతో పరిపాలిస్తే ఇక్కడైనా, అక్కడైనా, ఎక్కడైనా ప్రజాగ్రహానికి గురికాక తప్పదనే గుణపాఠం అన్ని పార్టీలకు నేర్పించాయి ఈ తెలుగు రాష్ట్రాల ఫలితాలు.
తీహార్ జైలులో ఉన్న తన చెల్లి కవితను పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ, ‘ఏపీలో ఫలితాలను ఊహించలేదు. సంక్షేమ పథకాలను అమలు చేసిన వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి మళ్లీ గెలుస్తాడని అనుకున్నాం. జగన్ ఓడిపోయినా వైఎస్‌ఆర్సీపీ దాదాపు 40 శాతం ఓట్లు సాధించింది. ఆయనను ఓడించేందుకు షర్మిలను వాడుకున్నారు. జగన్ హీరో, షర్మిల జీరో’ అని వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్సీపీలు తమ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, రెండు పార్టీల అధినేతల వ్యవహార శైలిలు వారి ఓటమికి ప్రధాన కారణాలని లోకం కోడై కూస్తున్నది. ఈ వాస్తవాలను విస్మరించిన ఈ పార్టీలు ప్రజా సంక్షేమ పథకాలు బోలెడు తెచ్చినా ఓటర్లు మమ్మల్నే ఓడించారని మదన పడుతున్నాయి.
పరస్పర సహకారాలు
వైఎస్‌ఆర్సీపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒకరికి ఒకరు అన్ని విధాలా సహకరించుకున్న ఉదంతాలు పలు ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ ప్రకటనతో ఇది వాస్తమని నిరూపితమైంది. వైఎస్ జగన్‌తో విభేదించి, సొంతంగా రాజకీయంగా ఎదగాలనే లక్ష్యంతో ఆయన సోదరి షర్మిల తల్లి విజయమ్మ అండతో తెలంగాణలో పార్టీ స్థాపిస్తే కేసీఆర్ సర్కార్, బీఆర్‌ఎస్ శ్రేణులు ఇబ్బందులకు గురి చేసిన ఘటనలున్నాయి. ఆమె చేపట్టిన యాత్రలపై బీఆర్‌ఎస్ దాడులు చేస్తే, కేసీఆర్ ప్రభుత్వం అరెస్టులు చేసింది.
ఈ చర్యలను అన్ని వర్గాలు ఖండించినా అన్న జగన్ స్పందించలేదు. తమ మిత్రుడైన జగన్ కళ్ళలో ఆనందం చూడడానికే తెలంగాణలో షర్మిలను అడుగడుగునా అడ్డుకున్నారని ఇప్పుడు కేటీఆర్ చేసిన ప్రకటన తేటతెల్లం చేస్తున్నది. షర్మిల ఉదంతమే కాకుండా గతంలో రెండు రాష్ట్రాల మధ్య పలుమార్లు రేగిన సెంటిమెంట్ ఉద్రిక్తతలు కూడా ఈ రెండు సర్కారుల చలవే అనేది బహిరంగ రహస్యమే. ఉదాహరణకు 2023 అసెంబ్లీ ఎన్నికల చివరిలో ఉరిమి పడ్డట్టు నాగార్జునసాగర్ వద్ద ఏర్పడిన ఉద్రిక్తతనే చెప్పవచ్చు. ఎన్నికలు ముగియగానే రెండు రోజుల ఈ నాటకీయ పరిణామాలకు తెరపడడమే ఈ పార్టీల తెరచాటు రాజకీయాలకు నిదర్శనం. ఇలా సాయపడ్డ జగన్ ఊహించని రీతిలో ఓడిపోవడంతో కేటీఆర్ కలత చెందినట్టున్నారు.
ఈ రెండు పార్టీలు ఒకరికొకరు సాయపడడమే కాదు. గతంలో అధికారంలో ఉన్న ప్పుడు వీరు తీసుకున్న కొన్ని పాలక నిర్ణయా లు కూడా ఒకే కోవలో ఉన్నట్టు కనిపిస్తాయి. కేసీఆర్ సర్కారు హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, జగన్ సర్కార్ కూడా విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్ వినియోగంలో ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి నూతన సచివాలయ భవనాన్ని నిర్మిస్తే, జగన్ అమరావతి కాదని విశాఖ రాజధాని అంటూ అక్కడ భవనాలు, ప్యాలెస్‌లు నిర్మించారు. వీరిద్దరూ భవనాలు, విగ్రహాలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఉద్యోగాల కల్పనకు ఇవ్వక పోవడంతో యువత వారిని గద్దె దింపడంలో కీలక పాత్ర పోషించింది.
ఒకే రకమైన వైఫల్యాలు
ఉద్యోగ నియామకాల వైఫల్యంతో నిరుద్యోగుల్లోనే కాక వీరి పాలనలో రెండు రాష్ట్రాల ఉద్యోగుల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉండేది. సమయానికి జీతాలు చెల్లించక పోవడం, ఉద్యోగుల బదిలీల్లో కావాల్సిన వారికే ప్రాధాన్యం ఇవ్వడం, సీపీఎస్ అమలులో దాటవేత వైఖరి ప్రభుత్వ ఉద్యోగుల్లో నిరాశను నింపింది. అంతేకాక తెలంగాణలో కేసీఆర్ తన విధేయులను ఎంపిక చేసుకొని ఉన్నత పోస్టుల్లో కూర్చోబెట్టడంతో అధికారం అంతా వారి కనుసన్నల్లోనే సాగింది. ఏపీలోనూ జగన్మోహన్‌రెడ్డి కీలక పోస్టులను తన వారికే కట్టబెట్టడంతో పెత్తనం అంతా వారిదే. రెండు రాష్ట్రాల్లోనూ ఇలాంటి అధికారుల పోకడలతో కిందిస్థాయి ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
కేసీఆర్, జగన్ పాలన రాచరిక పోకడలతోనే సాగింది. కోటల్లాంటి అధికారిక నివాసగృహలకే పరిమితమైన వీరిని కలవడం వారి భజనపరులు, కోటరీలకే సాధ్యమయ్యేది. మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ బడానేతలకూ వీరి దర్శనం భాగ్యమే అయ్యింది. ఇక, సాధారణ ప్రజల బాధలు వర్ణనాతీతం. రాజులకు తగ్గట్టే వారి నాయకుల వ్యవహార శైలీ కూడా ఉండేది. ‘ఒకరిని చూసి ఒకరు అనుసరించారా’ అన్నట్టు ఈ అంశాలలో బీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్సీపీ సర్కారులకు ఎన్నో పోలికలున్నాయి.
ప్రతిపక్షాలను అణగదొక్కే విధానాలు
సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చాక కూడా రెండు ప్రభుత్వాలు ప్రతిపక్షాలపై కక్ష గట్టినట్టే వ్యవహరించాయి. తమకు ఎదురు లేకుండా ఉండాలనే లక్ష్యంగా, ప్రతిపక్షాల ఉనికే లేకుండా చేయడానికి ప్రయ త్నించాయి. తెలంగాణలో కేసీఆర్ భారీ మెజార్టీ సాధించినా ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేలా మూకుమ్ముడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఇటు ఆంధ్ర ప్రదేశ్‌లో జగన్ అవసరం లేకపోయినా తెలుగుదేశం ఎమ్మెల్యేలను నైతిక విలువలు లేకుండా చేర్చుకున్నారు. లిక్కర్ స్కామ్ మరక రెండు పార్టీలకు అంటుకుంది. కేసీఆర్ కూతురు కవిత ఇప్పటికీ జైలులోనే ఉండగా, వైసీపీ బడా నేతలు అప్రూవర్‌లుగా మారి బయట తిరుగుతున్నారు. దీనికి అదనంగా జగన్‌కు బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మరో సమీప బంధువు అవినాశ్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలతో ఆయన సొంత కుటుంబంలో తుపాను ఏర్పడింది.
తెలంగాణ తెచ్చిన పార్టీగా రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురై, ఐదు నెలల వ్యవధిలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మరింత ఘోరంగా సున్నాకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఐదు నెలల సమయం ఉన్నా ఏ మాత్రం కోలుకోలేక, లోక్‌సభ ఎన్నికల్లో మరింత ఘోరంగా చతికిలబడింది. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీపై నమ్మకం సడలి పక్కచూపులు చూస్తున్న వేళ కేటీఆర్ పార్టీ బాగోగులు, భవిష్యత్ దృష్టి పెట్టాల్సింది పోయి ఇతర రాష్ట్రాల ఫలితాలపై విశ్లేషించడం హాస్యాస్పదమనే భావన సామాన్యుల్లో ఉంది.
ఆత్మ విమర్శ అవసరం
వైఎస్‌ఆర్సీపీకి దాదాపు 40 శాతం ఓట్లు రావడాన్ని కేటీఆర్ గొప్పగా చెప్పారు. 2019 ఎన్నికల్లో దాదాపు 50 శాతం ఓట్లు పొందిన ఆ పార్టీ ఇప్పుడు 10 శాతం ఓట్లు కోల్పోయింది. ఇటు బీఆర్‌ఎస్ కూడా 2018 ఎన్నికల్లో సగటున దాదాపు 47 శాతం ఓట్లు పొంది, 2023 ఎన్నికల్లో 37 శాతం ఓట్లు పొందింది. అంటే బీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్సీపీ రెండు పార్టీలు దాదాపు పది శాతం ఓట్లు కోల్పోయి అధికారాన్ని జేజార్చుకున్నాయి. ఎన్నికల్లో 10 శాతం ఓట్లు కోల్పోవడం తీవ్ర ప్రజావ్యతిరేకతకు నిదర్శనం. దీన్ని కప్పిపుచ్చుతూ వైఎస్‌ఆర్సీపీ 40 శాతం ఓట్లు పొం దిందని కితాబు ఇవ్వడం కేటీఆర్‌కే చెల్లింది.
ఒకరికొకరు సహకరించుకోవడమేకాక పలు పరిపాలనా నిర్ణయాల్లో ఒకే రకమైన విధానాలు అనుసరించిన వైఎస్‌ఆర్సీపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజావ్యతిరేకతను చవిచూశా యి. నిరంకుశ ధోరణి, అవినీతి, దౌర్జన్యాలు, కోటరీ, కోటలు వంటి సారూప్యాలతో ఎన్నికల రాజకీయాల్లో తగిన మూల్యం చెల్లించు కున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గతంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలు అవే తప్పులు చేశాయి, అదే ఫలితం పొందాయి. ప్రజాతీర్పుతో మట్టి కరిచిన ఈ రెండు పార్టీలు వాస్తవాలను గ్రహించి ఆత్మవిమర్శ చేసుకోకపోతే చివరన హీరో ఎవరో? జీరో ఎవరో? ప్రజలే తేలుస్తారు.
వ్యాసకర్త పొలిటికల్ అనలిస్ట్,
‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ