07-04-2025 10:11:43 PM
బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సుమన్...
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలకు ప్రధాన శత్రువులని, తీరని అన్యాయం చేస్తున్నాయని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సోమవారం సాయంత్రం బిఆర్ఎస్ నియోజవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం విషయంలో అసలు పట్టింపు లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ అభివృద్ధిని పక్కనపెట్టి అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులకు పాల్పడుతున్నదని విమర్శించారు.
అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉండి జిల్లాలో గులాబీ సైనికులుగా పనిచేస్తానన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కేసులకు, అక్రమ అరెస్టులకు, జైల్లు కొత్తేమీ కాదని, పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులపై మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో రామగుండం కమిషనరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈనెల 27న వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, నియోజవర్గ అన్ని మండలాల ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.