‘దేవర’ చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న తరుణంలో ప్రస్తుతం హీరో హీరోయిన్లపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికోసం ఎన్టీఆర్, జాహ్నవి ఇటీవల థాయ్‌లాండ్ పయనమయ్యారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ మార్టిస్ బాస్కో ఈ పాటకి నృత్య రీతులు సమకూర్చుతున్నారు. హిందీలో ‘పఠాన్’, ‘వార్’, ‘ఫైటర్’ వంటి చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేశారాయన. ఎంత కష్టతరమైన స్టెప్ అయినా ఒక్కసారి చూసి, ఎటువంటి సాధన లేకుండా సింగిల్ టేక్‌లో చేయగల నటుడు అని ఎన్టీఆర్‌కి ఎంతోమంది కితాబిచ్చిన సంగతి తెలిసిందే.
అలాంటి అసాధారణ ప్రతిభ గల ఎన్టీఆర్‌తో ప్రస్తుతం తాను పనిచేస్తున్నానంటూ ఆయనతో కలిసి దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు బాస్కో. ఇప్పటికే ‘ఫియర్’ సాంగ్ ఫీవర్‌తో ఊగిపోతున్న అభిమానులు ఈ పాటలో ఎన్టీఆర్ కోసం బాస్కో ఎలాంటి మూవ్స్ కంపోజ్ చేసుంటారా అని అంచనాలు వేయడం ఆరంభించేశారు. సెప్టెంబర్ 27న ఆ దృశ్యాలు తెరపై ఆవిష్కారం కానున్నాయి. ఇదిలా ఉంటే ఓ ప్రత్యేక గీతం కూడా ఈ సినిమాలో ఉండనుందని, అందులో ప్రముఖ హీరోయిన్ కనపడనున్నారని ప్రచారం నడుస్తోంది. అది మరెంత హీటెక్కించనుందో!