calender_icon.png 22 March, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టెడు దుఃఖంతో..

22-03-2025 01:31:46 AM

  1. వేర్వేరు చోట్ల తండ్రి మరణంలోనూ టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు
  2. మంచిర్యాలలో తెలుగు పేపర్‌కు బదులు హిందీ పేపర్
  3. రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష

హైదరాబాద్, బెల్లంపల్లి, చేగుంట, మార్చి 21 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా రెండు వేర్వేరు చోట్ల తమ తండ్రులను కోల్పోయిన పదో తరగతి విద్యార్థులు పుట్టె డు దుఃఖంలోనూ పరీక్షలకు హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న ముత్తాపూర్ గ్రామానికి చెందిన శ్రీలత తండ్రి మాచర్ల మల్లయ్య (65) అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు.

మరికొద్ది గంటల్లో పదో తరగతి పరీక్ష రాయాల్సి ఉండటంతో శ్రీలత గుండెల నిండ బాధతో కన్నెపల్లిలో పరీక్ష రాసింది. తండ్రి అంతిమ సంస్కారాలకు సైతం హాజరయ్యేందుకు వీలు లేకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుకున్న విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి గురువారం ఇందుప్రియాల్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు.

ఓవైపు తండ్రికి కొరివి పెట్టాల్సిఉండగా పుట్టెడు దుఃఖంతోనే పరీక్షకు హాజరయ్యాడు. ఇదే పాఠశాలలో చదువుకున్న హలావత్ మమ త అనే విద్యార్థినికి రెండు రోజుల కింద తీవ్ర కడుపునొప్పి రావడంతో అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. పరీక్ష రాయలేని స్థితిలో ఉన్నా ఓపిక తెచ్చుకొని తల్లిదండ్రుల సాయంతో  పరీక్ష రాసింది. 

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సెంటర్‌కు తెలుగు పేపర్ బదులు హిందీ ప్రశ్నాపత్రం వచ్చింది. దీంతో ఆ ప్రశ్నాపత్రాన్ని తిరిగి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి తెలుగు ప్రశ్నాపత్రం తీసు కొచ్చేందుకు రెండు గంటల సమయం పట్టింది. దీంతో 9.30 గంటలకు హాల్‌లోకి వెళ్లిన విద్యార్థులు 11.30 గంటల వరకు ఖాళీగానే కూర్చున్నారు.

విషయం తెలుసుకున్న కలెక్టర్ కుమార్ దీపక్, డీఈవో యాదయ్య పరిస్థితిని సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తెలుగు ప్రశ్నాపత్రాన్ని పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పాఠశాలలో ఈ ఘటన జరిగితే రెండు గంటలు పట్టగా, దూర ప్రాంతంలోని సెంటర్‌లో ఇలాంటి పరిస్థితి నెలకొంటే ఇంకెలా ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెల్లంపల్లి పట్టణంలోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో శుక్రవారం ఇన్విజిలేటర్ తప్పిదం వల్ల భవ్య శ్రీ అనే విద్యార్థినికి ప్రశ్నాపత్రం తారుమారైంది. హాల్‌టికెట్ లో సూచించిన విధంగా కాకుండా భవ్య శ్రీకి మోడల్ స్కూల్ విద్యార్థులకు అందజేయాల్సిన తెలుగు ప్రశ్నాపత్రం ఇచ్చారు. పాఠ్యాంశాలు ఒకటే కావడంతో విద్యార్థిని గుర్తించలేకపోయింది.

పరీక్షకు 1662 మంది డుమ్మా

పదో తరగతి పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. తొలిరోజు పరీక్షకు 1,662 మంది రెగ్యులర్ విద్యార్థులు డుమ్మాకొట్టారు. మొత్తం 4,96,549 మంది విద్యార్థులకుగానూ 4,94,887 (99.67 శాతం)మంది హాజరయ్యారు. 1353 మంది ప్రైవేట్ విద్యార్థులకుగానూ 1,024 మంది హాజరుకాగా, 329 మంది గైర్హాజరయ్యారు. ఒక మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదైంది.

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థి పది నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు లోనికి అనుమతివ్వలేదు. దీంతో ఆ విద్యార్థిని నిరాశగా వెనుదిరిగాడు.