calender_icon.png 21 October, 2024 | 1:34 AM

నా కోసమే పుట్టింది

30-07-2024 12:05:00 AM

“ధరణి గురించి దర్శకుడు చెప్పినపుడు.. ఈ పాత్ర నా కోసమే పుట్టిందనిపించింది” అంటూ ‘అలనాటి రామచంద్రుడు’ విశేషాలను ఆరంభించింది కథానాయిక మోక్ష. చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకత్వంలో కృష్ణవంశీ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కానున్న నేపథ్యంలో పాత్రికేయులతో సినిమాకి సంబంధించిన పలు విషయాలను పంచుకుందీ బెంగాలీ భామ. “కోల్‌కతాకి చెందిన నేను గత రెండేళ్లుగా తెలుగు, మలయాళ, తమిళ పరిశ్రమల్లో పని చేస్తున్నాను. రెండో సినిమాగా నేను తెలుగులో చేసిన ఈ సినిమాలో నా పాత్ర ప్రతి అమ్మాయి తనని తాను పోల్చుకునేలా ఉంటుంది. కథలో ప్రకృతి తత్వం కూడా కొంత కనపడుతుంది. ద్వితీయార్ధం పూర్తిగా మనాలిలో సాగే ఈ సినిమా కోసం అక్కడ మైనస్ డిగ్రీలలో చిత్రీకరించాం.

ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి” అని సినిమా సంగతులను ముగించింది మోక్ష. ‘లక్కీ లక్ష్మణ్’ సినిమాతో తెలుగు సినిమాలోకి వచ్చిన తనకు తెలుగు మాట్లాడటం కొంత వరకు వచ్చిందంటున్న ఆమె “సావిత్రి గారు చేసిన ‘దేవదాస్’ నుంచి సాయి పల్లవి నటించిన ‘విరాట పర్వం’ అనేక సినిమాలను చూసిందట. హీరో నాని తన అభిమాన కథానాయకుడంటోన్న మోక్ష, ఆయన సినిమాలలో బెంగాల్ నేపథ్యం గల ‘శ్యామ్ సింగరాయ్’పై  తనకు ప్రత్యేక అభిమానం అంటూ, ఎప్పటికైనా నానితో నటించాలన్న తన మనసులో మాట బయటపెట్టింది. తర్వాతి సినిమాల గురించి ప్రస్తావిస్తూ ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘-రామం రాఘవం’తో పాటు ఓ మలయాళ సినిమా విడుదలకు సిద్ధమైందని చెప్పుకొచ్చింది.