calender_icon.png 21 November, 2024 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోర్డర్ గావస్కర్ కి కహానీ

21-11-2024 12:00:00 AM

  1. దిగ్గజాలు అలెన్ బోర్డర్, సునీల్ గావస్కర్ పేరిట ట్రోఫీ
  2. 1996లో తొలిసారి నిర్వహణ
  3. టీమిండియాదే పైచేయి

న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగినప్పటికీ రెండేళ్లకోసారి జరిగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి మాత్రం ప్రత్యేకత వేరుగా ఉంటుంది. మిగతా సిరీస్‌ల్లో ఫలితం ఎలా ఉన్నా ఈ సిరీస్‌లో మాత్రం గెలవడానికి రెండు జట్లు నువ్వా-నేనా అన్న తరహాలో పోరాడుతుంటాయి.

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో దానికి రెట్టింపు క్రేజ్ ఈ ట్రోఫీకి ఉంటుంది. క్రికెట్‌ను విపరీతంగా అభిమానించే భారత్‌లో ఈ సిరీస్ జరిగినా.. ఆసీస్ గడ్డపై జరిగినా ఆదరణ మాత్రం అద్భుత స్థాయిలో ఉంటుంది.

అలాంటి బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో (నవంబర్ 22న) పెర్త్ వేదికగా తొలి టెస్టు మొదలుకానుంది. మరి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు బోర్డర్-గావస్కర్ పేరు ఎలా వచ్చింది? దాని కహానీ ఎంటనేది తెలుసుకుందాం.

1996లో తొలిసారి..

దేశానికి స్వాతంత్య్రానంతరం 1947-48లో భారత జట్టు తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆ సిరీస్‌లో 5 టెస్టులాడిన భారత్ ఒక్క దాంట్లోనూ విజయం సాధించకపోగా 0-4తో ఆసీస్‌కు సిరీస్ కోల్పోయింది. 1979-80లో భారత్‌లో జరిగిన ఆరు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2 గెలిచి తొలిసారి ట్రోఫీ అందుకుంది. 1991-92 వరకు మాములు టెస్టు సిరీస్‌గానే పిలవబడింది.

1996లో ఆస్ట్రేలియా ఏకైక టెస్టు మ్యాచ్ ఆడేందుకు భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్లకు విశేష సేవలందించిన దిగ్గజ క్రికెటర్లు సునీల్ గావస్కర్, అలెన్ బోర్డర్ గౌరవార్థం ఆ సిరీస్‌కు ‘బోర్డర్-గావస్కర్’ ట్రోఫీగా నామకరణం చేశారు. అలా పురుడు పోసుకున్న ఈ సిరీస్ ఇప్పటికీ విజయవంతంగా సాగుతోంది.

ఇప్పటివరకు బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరుజట్ల మధ్య 16 సిరీస్‌లు జరగ్గా.. టీమిండియాదే పైచేయిగా ఉంది. భారత్ 10 సార్లు నెగ్గితే.. ఆస్ట్రేలియా ఐదుసార్లు విజేతగా నిలిచింది. (2003-04) సిరీస్ మాత్రం డ్రాగా ముగిసింది. చివరి నాలుగు సిరీస్‌ల్లోనూ భారత్‌దే హవా. ఇందులో రెండుసార్లు ఆసీస్‌ను వారి సొంతగడ్డపై (2018-19, 2020-21) వరుసగా మట్టికరిపించడం విశేషం.