calender_icon.png 16 January, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో బోపన్న జోడీ

04-09-2024 12:58:24 AM

క్వార్టర్స్‌లో క్రెజికోవా జంటపై విజయం

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న మిక్స్‌డ్ విభాగంలో సెమీస్‌లో అడుగుపెట్టాడు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన మిక్సడ్ డబుల్స్ క్వార్టర్స్‌లో బోపన్న అల్‌దిలా సుత్జిది (ఇండోనేషియా) ద్వయం 7 (7/4), 2 10 నాలుగో సీడ్ ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్ బార్బరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) జంటపై కష్టపడి విజయాన్ని నమోదు చేసుకుంది. గంటన్నర పాటు సాగిన పోరులో తొలి సెట్‌ను టై బ్రేక్‌లో గెలిచిన బోపన్న జంట.. ఆపై రెండు సెట్లలో హోరాహోరి పోరు ఎదురైనప్పటికీ తమ అనుభవాన్ని రంగరించి వరుస సెట్లలో గెలుపు అందుకున్నారు.

మ్యాచ్‌లో బోపన్న జంట ఆరు ఏస్‌లు సంధించడంతో పాటు 27 విన్నర్లు కొట్టింది. మరోవైపు 3 ఏస్‌లకు మాత్రమే పరిమితమైన క్రెజికోవా జోడీ ఐదు డబుల్ ఫాల్ట్స్ చేసింది. 26 అనవసర తప్పిదాలతో ఓటమి చవిచూసింది. సెమీస్‌లో బోపన్న జంట అమెరికా జోడీ టౌన్‌సెండ్ డొనాల్డ్ యంగ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 44 ఏళ్ల బోపన్న ఇప్పటికే డబుల్స్ విభాగంలో మూడో రౌండ్‌లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ నెగ్గిన బోపన్న ఆఖరిసారిగా 2017లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు.