calender_icon.png 18 January, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూతు యూట్యూబర్‌కు 14 రోజుల రిమాండ్

12-07-2024 01:33:31 AM

  1. పోక్సో చట్టంతోపాటు మరో రెండు సెక్షన్ల కింద కేసులు 
  2. మరో ముగ్గురు నిందితులపైనా కేసు నమోదు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): సభ్యసమాజం తలదించుకునేలా సోషల్ మీడియాలో తండ్రికూతుళ్లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు చుట్టూ ఉచ్ఛు బిగుస్తోంది. బుధవారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రణీత్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రణీత్‌పై పోక్సో చట్టం 79తో పాటు ఐటీ యాక్ట్ 67బీ, భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్  294 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతనితో లైవ్ చాటింగ్ చేసిన మరో ముగ్గురు నిందితులపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ2 డాలస్ నాగేశ్వరరావు, ఏ3 బుర్రా యువరాజ్, ఏ4 సాయి ఆదినారాయణను చేర్చారు. హన్మంతును విచారించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గురువారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో హజరుపరిచారు. ప్రణీత్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

వీడియోలను రోస్ట్ చేస్తూ పాపులారిటీ..

ప్రణీత్ గత మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు. ఉన్నత చదువులు చదివిన కుటుంబసభ్యులు. సమాజంలో మంచి గౌరవం. తండ్రి ఐఏఎస్ అధికారి, తల్లి గృహిణి. యూట్యూబ్‌లో ‘ఫన్‌మంతు’ అనే పేజీ ద్వారా యూట్యూబ్‌లో వచ్చిన వీడియోలను రోస్ట్ చేస్తూ పాపులారిటీ సంపాదించాడు. అలాగే పలు సినిమాల్లో నటించిన ప్రణీత్, ఇటీవల సుధీర్‌బాబు నటించిన ‘హరోమ్ హర’ చిత్రంలో తమిళనాడుకు చెందిన డాన్ పాత్రలో నటించాడు.

అతని సోదరుడు కూడా ఫేమస్ యూట్యూబర్. స్టులింగ్ టిప్స్ ఇస్తూ పాపులర్ అయ్యాడు. అయితే తాజాగా తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని అపహాస్యం చేస్తూ అమెరికాలో ఉంటున్న ఓ తెలుగు కుటుంబం షేర్ చేసిన రీల్‌పై జోకులు వేశాడు. అతని వ్యాఖ్యలతో పాటు లైవ్ వీడియో చాటింగ్ చేసిన మరో ముగ్గురు మాట్లాడిన మాటలు ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. కొంతమంది నెటిజన్లు ప్రణీత్ కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను అనుసరించి, ప్రణీత్ తన చర్యలను డార్క్ హ్యూమర్‌గా సమర్థిస్తూ క్షమాపణ వీడియోను విడుదల చేశాడు. ఇది ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసినట్లు అయింది. 

సాయిధరమ్ ట్వీట్‌తో వెలుగులోకి..

తండ్రీకూతుళ్ల బంధంపై అసహ్యంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రణీత్ మాట్లాడిన వీడియో చూసిన సినీ హిరో సాయిధరమ్‌తేజ్ దానిని తీవ్రంగా ఖండించారు. ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ ఎక్స్ ఖాతా ద్వారా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, డీజీపీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై మొదటగా స్పందించిన భట్టి విక్రమార్క, డీజీపీ తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ ఆదేశాలతో బెంగుళూరులో ప్రణీత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు.