calender_icon.png 1 November, 2024 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూతే ప్రచార మంత్రం

12-05-2024 03:10:06 AM

ఎన్నికల్లో అగ్రనేతల బూతుల దండకం

ఒకరికి మించి ఒకరు కొత్తకొత్త తిట్లు

సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ పోటాపోటీ

వ్యక్తిగత దూషణలకూ వెనుకాడని నేతలు

నేతల తీరును యావగించుకొంటున్న ప్రజలు

హైదరాబాద్, మే ౧౧ (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో కొత్త వాతావరణ.. కొత్త ప్రసంగాలు.. కొత్త ప్రయోగాలు.. కొత్త తిట్లు తెరపైకి వచ్చాయి. మూడు ప్రధాన పార్టీల మధ్యన తిట్ల వార్ తీవ్రంగా నడిచింది. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య జరిగిన తిట్ల యుద్ధం సామాన్య ప్రజలకు కూడా ఓ దశలో యావగింపు కలిగించింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. రెండు నెలలపాటు అలుపెరుగక సాగిన ఈ తిట్ల యుద్ధానికి శనివారం సాయంత్రం తెరపడింది. ఎన్నికల ప్రచారం ముగియటంతో నేతల తిట్లు వినే తిప్పలు ప్రజలకు తప్పింది. నేతల మధ్య తిట్ల వార్ సాగిందిలా..

సీఎం రేవంత్‌రెడ్డి తిట్లు

పదేండ్లలో మనకు మోదీ ఏమిచ్చిండు.. గాడిద గుడ్డు 

కేసీఆర్ అనేవాడు ఒక జాదూగాడు.. ఓ సన్నాసోడా.. సోయిలేనోడా.. చవట.. దద్దమ్మ.. దిక్కుమాలినోడా..

కొడకల్లారా ఎవరన్నా టచ్‌చేసి చూడుం డ్రి.. మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై.. మానవ బాంబులై.. నా కొడ కల్లారా.. ఎవరన్నా మిగుల్తరేమో చూస్తా..

ఒక్కనొక్కన్ని పండవెట్టి తొక్కి.. పేగులు తీసి మెడలో వేసుకుని.. ఊరేగుతా బిడ్డా.. ఎవరన్నా ఈ ప్రభుత్వం జోలికి వస్తే..

నీలాంటోళ్లను గోతితీసి బొంద పెట్టుడు కూడా తెలుసు.

ఆ సన్నాసులకు చెప్పదల్చుకున్నా.. మా ప్రభుత్వం ఉండదని గ్రామాలకు వస్తే.. మా కార్యకర్తలు వారిని పట్టుకుని వేపచెట్టుకు కట్టేసి.. లాగుల తొండలు విడిచి కొట్టాలి. 

నీకు చాతనైతే.. దమ్ముంటే.. నవ్వు మొగోడివైతే తెలంగాణలో ఒక్క సీటు గెలిచి చూపించు. నువ్వొస్తవా.. నీ అయ్యొస్తడా.. మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డా..

అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా.. నిటారుగా నిలబడి.. నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందపెట్టి.. ఇయ్యాల ఆ కుర్చీలో కూర్చున్నం.

కార్యకర్తలు అండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు.. నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు.. దేవుడొచ్చినా ఈ కుర్చీని తాకలేరు.

కేసీఆర్ తిట్లు

అరే.. ఏం అరుస్తారురా బై.. బేవకూఫ్‌గాళ్లు మీరు.. మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి.. బయటకు వెళ్ళండి.

థూ మీ బతుకులు చెడ.. సన్నాసి ముండాకొడుకులు.

మేము చాలామంది రాకాసులతో కొట్లాడినం.. ఈ గోకాసురులు మా గోసికింద ఒక లెక్కకాదు.. తొక్కి పడేస్తాం.

ప్రాజెక్టు మొదలు పెడదామని అనగానే.. ఈ ఆంధ్రా లఫంగి గాళ్లు నన్ను ఎన్నిసార్లు అనలేదు.. గాడిద కొడుకులు.. సన్నాసి ముండాకొడుకులు.

తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా.. తెలంగాణను వ్యతిరేకించినోళ్లను దద్దమ్మలు అన్నా.. సన్నాసులు అన్నా.. 

కిషన్‌రెడ్డి తిట్లు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఓ గాడిదగుడ్డు ప్రభుత్వం

మల్లారెడ్డి తిట్లు

ఇద్దరం రాజీనామా చేసి పోటీపడుదాంరా సాలే..

బాల్క సుమన్ తిట్లు

కేసీఆర్‌ను రండ అంటావా.. రండగాడా.. (సీఎంను ఉద్దేశించి) హౌలే.. పాగల్.. దేడ్ దిమాక్‌గాడు.. చెప్పుతో కొడతా..

ధర్మపురి అర్వింద్ తిట్లు

కుక్కతోక ఎంత వంకరనో.. కేసీఆర్ నాలుక కూడా అంతే వంకర.

ఏం రాజకీయాలు సార్ ఇవి?

ఏం రాజకీయాలు సర్ ఇవి.. లీడర్లు ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటుండ్లు.. ఇందిరమ్మ, ఎన్టీయార్ రాజ్యంలో ఇట్లాంటి మాటలు చూడలే. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక చిన్న లేదు.. పెద్ద లేదు. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం అయితలేదు. కేసీఆర్ తిట్టిండని రేవంత్ సర్ తిట్టడం.. వాళ్ళను చూసి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తిట్టుడు షురూ చేసిండ్రు. టీవీల్లో వచ్చే వాళ్ల మాటలు వినాలంటేనే ఇబ్బంది అయితున్నది సర్. ఈ భాష బంద్ చేయాలి.

 సత్యం, టిఫిన్ సెంటర్, హన్మకొండ

నాయకులు ఆదర్శంగా ఉండాలి


నాయకులు ఎట్లపడితే అట్ల మాట్లాడితే మంచిగా ఉండదు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇతర పార్టీల నాయకులను మర్యాద లేకుండా మాట్లాడుతూ తిట్టేవారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సీఎం అయినంక ఆయన కూడా గట్లనే మాట్లాడుతున్నారు. సీఎం కానీ.. ఎమ్మెల్యే కానీ.. ఎవరైనా నాయకులు మాట్లాడినది ప్రజలు వింటారు. నాయకులు పద్ధతి లేకుండా మాట్లాడితే ప్రజల్లో లోకువైపోతారు. ఈ మధ్య కాలంలో నాయకులు ఇలా ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ మాట్లాడుకోవడం గొప్పగా అనుకుంటున్నారు. కానీ ఇలా మాట్లాడటంతో రాజకీయ నాయకులకు విలువ లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాలి.

 పొలిపెళ్లి నాందేవ్, 

టీ స్టాల్ నిర్వాహకుడు, భీంసరి, ఆదిలాబాద్ జల్లా