- 78,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్
- నిఫ్టీ 162 పాయింట్లు డౌన్
ముంబై, జనవరి 9: దేశీయ ఆర్థిక వ్యవస్థ పట్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు విస్త్రతస్థాయిలో అమ్మకాలు జరపడంతో గురువారం స్టాక్ సూచీలు భారీగా తగ్గాయి. బీఎస్‌ఈ సెన్సె క్స్ 78,000 పాయింట్ల స్థాయిని, నిఫ్టీ 23, 600 పాయింట్ల స్థాయిని వదులుకున్నాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 605 పాయింట్లు క్షీణించి 77,542 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది.
చివరకు 528 పాయింట్ల నష్టంతో 77,542 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీ ఇంట్రాడేలో 23,503 పాయింట్ల వద్ద కనిష్టస్థాయిని తాకిన అనంతరం చివరకు 162 పాయింట్ల నష్టంతో 23,526 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. హెవీవెయిట్ షేర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ ఇం డస్ట్రీస్‌లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
చైనాలో వినియోగ డిమాండ్ పూ ర్తిగా మందగించిందన్న వార్తలు, యూఎస్ బాండ్లలో విక్రయాలు కూడా దేశీయ ఈక్విటీలను అమ్మకాల ఒత్తిడికి లోనుచేశాయని విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి నాలుగేండ్ల కనిష్ఠం 6.4 శాతానికి పరిమితమవుతుందంటూ వెలువడిన ప్రభుత్వ గణాంకాలు, రూపాయి క్షీణత మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని ట్రేడర్లు చెప్పారు.
ఒక్కరోజులో రూ.7,171 కోట్ల ఎఫ్‌పీఐ విక్రయాలు
కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి నిధుల్ని తరలిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) గురువారం భారీగా విక్రయాలు జరిపారు. గురువారం ఒక్కరోజులోనే రూ. 7,171 కోట్లు నికర అమ్మకాలు జరిపినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దీంతో ఈ వారం వరుస నాలుగు రోజుల్లో వీరి నికర అమ్మకాలు రూ. 14,500 కోట్లకు చేరాయి. డాలర్ పటిష్టంగా ఉంటూ యూ ఎస్ బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయమైన రాబడులు ఇస్తున్నంతకాలం ఎఫ్ పీఐలు విక్రయాలు కొనసాగిస్తారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వె స్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు.
టాటా స్టీల్ టాప్ లూజర్
సెన్సెక్స్-30 ప్యాక్‌లో అన్నింటికంటే అధికంగా టాటా స్టీల్ 2.75 శాతం తగ్గింది. జొమాటో, లార్సన్ అండ్ టుబ్రో, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రాలు 2 శాతం వరకూ క్షీణించాయి. మరోవైపు నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనీలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్2 శాతం వరకూ పెరిగాయి.
వివిధ రంగాల సూచీల్లో అధికంగా రియల్టీ ఇండెక్స్ 2.90 శాతం క్షీణించింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2.19 శాతం తగ్గింది. ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 1.51 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 1.83 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.34 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 1.43 శాతం, మెటల్ ఇండెక్స్ 1.34 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.80 శాతం చొప్పున తగ్గాయి.
సర్వీసెస్ ఇండెక్స్ 1.26 శాతం, పవర్ ఇండెక్స్ 1.17 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 0.95 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.17 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.96 శాతం చొప్పున తగ్గాయి.