calender_icon.png 29 September, 2024 | 9:07 PM

బూమ్ బూమ్ బుమ్రా

21-09-2024 12:00:00 AM

  1. నాలుగు వికెట్లతో మెరిసిన జస్ప్రీత్ 
  2. బంగ్లా పని పట్టిన టీమిండియా 
  3. తొలి ఇన్నింగ్స్‌లో 149 ఆలౌట్ 
  4. భారీ ఆధిక్యం దిశగా భారత్

చెన్నై: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. గిల్ (33 నాటౌట్), పంత్ (12 నాటౌట్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల లీడ్ సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ కలుపుకొని ఇప్పటివరకు 308 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో రోజంతా ఆడి బంగ్లా ముందు 500 పరుగుల టార్గెట్ విధించడమే భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

మూడో రోజు నుంచి బౌలర్లకు మరింత సహకరించే చెపాక్ పిచ్‌పై బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో నిలవడం శక్తికి మంచిన పనే. అంతకముందు భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. షకీబ్, లిటన్‌దాస్‌లు మధ్యలో కాస్త పోరాడిన ఫలితం లేకపోయింది. బుమ్రా 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. పేసర్లు పండగ చేసుకున్న పిచ్‌పై జడేజా రెండు కీలక రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. 

మరో 37 పరుగులు జోడించి..

339/6 క్రితంరోజు స్కోరుతో రెండో రోజును ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ ఎదురయ్యింది. సెంచరీ చేస్తాడనుకున్న రవీంద్ర జడేజా (86) అదే స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజులోకి ఆకాశ్ దీప్ (17, 4 ఫోర్లు) కాస్త వేగంగా ఆడడంతో భారత్ స్కోరు 350 దాటింది. సెంచరీ హీరో అశ్విన్ (113) తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో టీమిండియా ఆలౌట్ కావడానికి పెద్దగా సమయం పట్టలేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్ముద్ ఐదు వికెట్లతో చెలరేగగా.. తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. అయితే పేసర్లకు విపరీతంగా సహకరిస్తున్న పిచ్‌పై టీమిండియా బౌలర్లు చెలరేగి బంగ్లాదేశ్ పని పట్టారు.

బౌలర్లు భళా..

గతానికి భిన్నంగా ఈసారి చెన్నై పిచ్‌ను ఎర్రమట్టితో తయారు చేయడంతో పిచ్ పేసర్లకు విశేషంగా అనుకూలించింది. భారత్‌ను ఆలౌట్ చేశామన్న సంబరంతో తొలి ఇన్నిం గ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు ఏ దశలోనూ కలిసిరాలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన బంగ్లా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. 40 పరుగులకే ఐదు వికెట్లు కోల్పో యిన దశలో షకీబ్ (32), లిటన్ దాస్ (22) ఆరో వికెట్‌కు 50 పరుగులు జోడించడంతో కాస్త కుదురుకున్నట్లే కనిపించింది.

కానీ ఈ ఇద్దరిని జడేజా  స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. బుమ్రా 4 వికెట్లు తీశాడు. 227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు మరోసారి నిరాశే ఎదు రైంది. ఓపెనర్లు జైస్వాల్ (10), రోహిత్ (5) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అనంతరం పంత్‌తో కలిసి గిల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించాడు.