calender_icon.png 28 December, 2024 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విభిన్న ఆలోచనల సమ్మేళనం బుక్‌ఫెయిర్

27-12-2024 02:41:58 AM

  1. వర్షంలోనూ పుస్తకప్రియుల సందడి 
  2. ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు 
  3. బుక్‌ఫెయిర్‌ను విజిట్ చేసిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (విజయక్రాంతి): హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న 37వ జాతీయ బుక్‌ఫెయిర్ మహోత్సవంలో పుస్తకప్రియులతో సందడిగా నెలకొంటుంది. చరిత్ర, సామాజికం, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య, సైకాలజీ రంగాలకు చెందిన కథలు, నవలలు, కవిత్వం తదితర పుస్తకాలతో పాటు ఆధ్యాత్మిక పుస్తకాలు సైతం ఒకే వేదికపై అందుబాటులో ఉండటంతో ఈ బుక్ ఫెయిర్‌ను వేలాది మంది పుస్తక ప్రియులు ప్రతిరోజూ సందర్శిస్తున్నారు.

తమకు ఆసక్తి కలిగిన పలు పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. బోయి విజయభారతి, తోపుడుబండి సాధిక్ వేదికలపై పలు పుస్తకావిష్కరణలతో పాటు విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు, చిన్న పిల్లలకు పుస్తకాల పట్ల, పుస్తక పఠనం పట్ల మరింత ఆసక్తిని పెంచేందుకు కథలతో ముద్రించిన పుస్తకాలు చిన్నారులు, పాఠశాల స్థాయి విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి.

తేటతెలుగు, కథల ప్రపంచం, చిన్నారినేస్తం, నల్లమలలో, కొండలలో వింతలు, పిసినారి పాట్లు, దానకర్ణుడు, కథలు విందాం, పిచ్చి పుల్లయ్య, చిరుతను బురిడీ కొట్టించిన, కథలంటే మాకిష్ణం, జతగాళ్లు కథగాళ్లు తదితర పుస్తకాలను చిన్నారులు అత్యధికంగా కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి గురువారం సందర్శించారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్‌కే) ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రచించిన శ్రీ శూద్రగంగ కావ్యం పుస్తకావిష్కరణ గురువారం జరిగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోకకవి అందెశ్రీ, ప్రొఫెసర్ కాశీం, ప్రొఫెసర్ క్యాతాయని విద్మహే, ప్రముఖ సినీనటుడు ఉత్తేజ్, కవి, విమర్శకులు కోయి కోటేశ్వరరావు పాల్గొన్నారు. తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాల ప్రస్థానంపై వికీపీడియా గురించి మీకు తెలుసా పుస్తకాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో కుసుమ ధర్మన్న కళాపీఠం ముద్రించిన దాశరథి పుస్తకాన్ని నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు.

సంగనభట్ల నర్సయ్య, కాలువ మల్లయ్య, రామస్వామి అధ్యక్షతన వేర్వేరుగా నాకు నచ్చిన పుస్తకం, నన్ను ప్రభావితం చేసిన పుస్తకం పుస్తకాల ప్రచురణ అవసరం ప్రాముఖ్యత అనే అంశాలపై చర్చా గోష్టులు జరిగాయి.