calender_icon.png 26 December, 2024 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుక్‌ఫెయిర్‌లో పుస్తకప్రియుల సందడి

26-12-2024 03:15:51 AM

* ఫస్ట్ రీల్ పుస్తకాన్ని ఆవిష్కరించిన త్రివిక్రమ్ 

* విజయక్రాంతి స్టాల్ సందర్శించిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (విజయక్రాంతి): ఇందిరాపార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న బుక్ ఫెయిర్‌కు 7వ రోజు బుధవారం చిరు జల్లులు కురుస్తున్నా.. పుస్తకప్రియులు పెద్దఎత్తున తరలొచ్చారు. క్రిస్మస్ సందర్భంగా సెలవు రోజు కావడంతో విద్యార్థులు, యువత తల్లిదండ్రులతో కలిసి బుక్ ఫెయిర్‌ను విజిట్ చేశారు. సినీ దర్శకుడు త్రివిక్రమ్ బుక్ ఫెయిర్‌లో పాత్రికేయులు రెంటాల జయదేవ్ రచించిన ఫస్ట్ రీల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

రచయితల స్టాల్‌లో రోహిత్ సాయి రచించిన ప్రియ భారత జననీ పుస్తకాన్ని ప్రొగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ హిప్నో పద్మాకమలాకర్, తెలంగాణ అధ్యక్షుడు సాగర్ల రఘు, జయశ్రీ ఆవిష్కరించారు. మాజీ మంత్రి కే జానారెడ్డి బుక్ ఫెయిర్‌ను సందర్శించి తనకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు.

బుక్ ఫెయిర్ సలహాదారులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ బుక్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన విజయక్రాంతి స్టాల్‌ను సందర్శించి పత్రికలో వచ్చే వార్తా కథనాలు బాగుంటున్నాయని ప్రశంసించారు.

ఈ సందర్భంగా ప్రముఖ కవి ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనం ఆకట్టుకుంది. ఇందులో కవులు కాంచనపల్లి, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, కందుకూరి శ్రీరాములు, చమన్ సింగ్, బాణాల శ్రీనివాస్ రావు, బెల్లంకొండ సంపత్ కుమార్, దాసోజు కృష్ణమాచారి, సీహెచ్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. పుస్తక స్ఫూర్తి కార్యక్రమం లో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాల్గొన్నారు. విరాట్ నవల aతనను బాగా ప్రభావితం చేసిందన్నారు.